నేడు టీఆర్‌ఎస్వీ విస్తృతస్థాయి సమావేశం

తెలంగాణ రాష్ట్ర సమితికి విద్యార్థి విభాగమే రాబోయే తరానికి కీలకమని చెప్పారు సీఎం కేసీఆర్‌. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై స్పందించే గుణం రావడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూడా అవగాహన పెరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి సంఘం నాయకులకు ప్రజాప్రతినిధులుగా, వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా అవకాశం కల్పించినట్లు సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. విద్యార్థి సంఘంలో కొనసాగే వారికి ఇలాంటి అవకాశాలు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్వీలో చురుగ్గా పని చేసిన బాల్క సుమన్‌కు ఎంపీగా, గ్యాదరి కిశోర్‌కు ఎమ్మెల్యేగా, పిడమర్తి రవి, చిరుమళ్ల రాకేశ్, వాసుదేవరెడ్డి వంటివారికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశాలు కల్పించినట్లు గుర్తు చేసారు సీఎం కేసీఆర్‌.

రాబోయే రోజుల్లో ప్రతి కాలేజీ, విద్యాసంస్థలో సభ్యత్వ నమోదు, కమిటీలను ఏర్పాటు చేయాలని ఉద్బోధించారు సీఎం కేసీఆర్‌. దీనికోసం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరూ వారికి సహకరించాలని సూచించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. మంత్రి కేటీఆర్‌, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్వీ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని సీఎం ప్రకటించారు. విద్యార్థి శక్తిని తక్కువగా అంచనా వేయవద్దని, వారిశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

టీఆర్‌ఎస్వీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం ఇవాళ తెలంగాణ భవన్‌ లో అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరుగనున్నది. దీనికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్‌, టీఆర్‌ఎస్వీ కోఆర్డినేటర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎంఓ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ హాజరుకానున్నారు. విద్యార్థి సంఘం నాయకులుగా ఉండి వివిధ హోదాల్లో పనిచేసిన బొంతు రామ్మోహన్, గాదరి కిశోర్, చిరుమళ్ల రాకేశ్, బాబా ఫసియుద్దీన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి కూడా హాజరై ప్రసంగిస్తారు. టీఆర్‌ఎస్వీ సభ్యత్వాల పుస్తకాలు, పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లు నాయకులకు అందిస్తారు. సమావేశం అనంతరం మెటీరియల్‌తో వెళ్లే వాహనాలను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభిస్తారు. గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించనున్నారు.