నవభారతం దిశగా ప్రయాణం ప్రారంభం

అర్ధరాత్రి నుంచి నూతన భారత నిర్మాణం దిశగా మన ప్రయాణం మొదలైంది అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో చారిత్రక జీఎస్టీ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో దేశమంతా ముందుకు సాగడానికి కొంత సమయం పడుతుందన్నారు. జీఎస్టీ అంటే మంచి, సులువైన పన్ను విధానం అని, సులభతర వాణిజ్యం అమలుకు వీలు కల్పిస్తుందన్నారు. జీఎస్టీ ఒక సామాజిక సంస్కరణ అని అభివర్ణించారు. దీని అమలుతో ఆర్థిక సంస్కరణలు తేవడం మాత్రమే గాక సామాజిక సంస్కరణలకు నాంది ప్రస్తావన కానున్నదని తెలిపారు. ఇది కొత్త శకం. ఈ శకం ప్రారంభానికి 125 కోట్ల మంది భారతీయులే సాక్ష్యం. పేదల హితం కోసమే జీఎస్టీని తీసుకొస్తున్నాం అని చెప్పారు. జీఎస్టీతో నూతన భారత్ నిర్మించాలన్న కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ ప్రారంభంతో భారత్ నవ్య పథానికి అంతా సిద్ధమైందన్నారు. పలువురు మేధావుల కృషి ఫలితంగానే జీఎస్టీ రూపుదిద్దుకున్నదన్నారు. దాని అమలుకు మనమంతా సాక్షీభూతంగా నిలుస్తున్నామని చెప్పారు. భారత్‌కు స్వాతంత్య్రం లభించినందుకు ప్రతీకగా 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాలు నిలుస్తుందన్నారు.

రాజ్యాంగానికి ఆమోదం తెలిపేందుకు 1949లో ఇక్కడ సమావేశమయ్యామని గుర్తు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో పలువురు గొప్పనేతలు కొలువుదీరారని, ఇది అత్యంత పవిత్రమైన స్థలం అని ప్రధాని మోదీ అభివర్ణించారు. చాలా కాలం తర్వాత ఆర్థిక సంస్కరణలో భాగమైన జీఎస్టీ అమలు కోసం మనమంతా ఇదే సెంట్రల్ హాలులో సమావేశమయ్యామని చెప్పారు. దీని అమలు ప్రారంభానికి ఇంతకంటే మెరుగైన వేదిక ఉండబోదని స్పష్టంచేశారు. సహకార సమాఖ్య వ్యవస్థకు జీఎస్టీ చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు. పలు అంశాలపై అసమ్మతులు, వాగ్వాదాలు చోటు చేసుకుంటాయని, అయినా చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చునని చెప్పారు. అదే మార్గంలో జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభించిందని ప్రధాని మోదీ అన్నారు. సుదీర్ఘ కాలం పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే జీఎస్టీ రూపుదిద్దుకున్నదని పేర్కొన్నారు. జీఎస్టీతో అత్యాధునిక పన్ను వ్యవస్థ ద్వారా భారత్ ముందడుగు వేస్తుందన్నారు. అల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ఆదాయం పన్ను అంటే సంక్లిష్టమైన అంశమని చెప్పారని ప్రధాని మోడీ చమత్కరించారు. దేశంలోని పలు సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడం చేయడానికి సర్దార్ వల్లభాయి పటేల్ అహర్నిశలు కృషి చేశారని, అదే రీతిలో జీఎస్టీ కూడా ఆర్థికంగా భారతదేశాన్ని ఏకీకృతం చేస్తుందన్నారు. భారతీయ రైల్వేల మాదిరిగా జీఎస్టీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలిపేస్తుందన్నారు. దీని వల్ల ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి వెనుకబడిన రాష్ర్టాలు మిగతా అభివృద్ధి చెందిన రాష్ర్టాలతో సమానంగా ముందుకు వెళ్లేందుకు వీలవుతుందన్నారు.