ధాన్యం కొనుగోలులో తెలంగాణ రికార్డ్!

ధాన్యం సేకరణలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ రికార్డు సృష్టించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రైతుల నుంచి 53 లక్షల 66 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గత రికార్డుకన్నా ఇది 216 శాతం అధికం. 2013-14లో 3 వేల 285 కొనుగోలు కేంద్రాల ద్వారా 24 లక్షల 82 వేల టన్నుల ధాన్యాన్ని కొన్నారు. అదే ఇప్పటివరకు రికార్డు. ఈ ఏడాది దానికన్నా రెండు రెట్లకుపైగా ఎక్కువ ధాన్యాన్ని సేకరించారు. ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో 5 వేల 231 కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 10 లక్షల 93 వేల 196 మంది రైతుల నుంచి 53 లక్షల 66 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

ఈ ఏడాది వానాకాలంలో 2 వేల 178 కొనుగోలు కేంద్రాల ద్వారా 4 లక్షల 176 మంది రైతుల నుంచి 16 లక్షల 52 వేల టన్నుల ధాన్యాన్ని 2 వేల 479 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. యాసంగిలో 6 లక్షల 93 వేల 20 మంది రైతుల నుంచి 37 లక్షల 14 వేల టన్నుల ధాన్యాన్ని 5 వేల 627 కోట్లు వెచ్చించి సేకరించారు. దీనికోసం 9 కోట్ల 25 లక్షల గోనెసంచులను సమకూర్చారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు వెయ్యి 510, సాధారణ రకానికి వెయ్యి 470 రూపాయలు చెల్లించారు.

దళారుల ప్రమేయం ఉండకూడదన్న ఉద్దేశంతో ఆన్‌లైన్ చెల్లింపులకు పౌర సరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది 8 వేల 105 కోట్లను ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమచేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ చేయడంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన జిల్లాల కలెక్టర్లు, జేసీలు, పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.