దేశ చరిత్రలో అపురూప ఘట్టం ఆవిష్కృతం

ఒకే దేశం.. ఒకే విపణి.. ఒకే పన్ను! పదిహేడేండ్లనాటి ఆలోచన.. ఎట్టకేలకు వాస్తవరూపం దాల్చింది! పద్దెనిమిది పర్యాయాల సుదీర్ఘ సమావేశాలు.. పదకొండు నెలల చర్చోపచర్చల్లో.. షాంపూ మొదలు.. జెట్ విమానాలదాకా పన్నెండు వందలకుపైగా వస్తువులు, సేవల పన్నులను ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం.. వస్తుసేవల పన్ను వ్యవస్థను అట్టహాసంగా అమల్లోకి తెచ్చింది! చారిత్రాత్మక పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో రాజకీయనేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖుల సమక్షంలో ప్రథమ పౌరుడు ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత సైరన్ మోగించి.. చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రపంచానికి చాటారు! సుమారు 125 కోట్ల జనాభా కలిగిన దేశాన్ని.. 130 లక్షల కోట్ల రూపాయల దేశ ఆర్థిక వ్యవస్థను విప్లవాత్మక పన్ను సంస్కరణల యుగంలోకి ముందడుగేయించారు!

ఇప్పటికే ప్రపంచంలో 142 దేశాలు జీఎస్టీని అమలు చేస్తున్నాయి. ఐతే అత్యధిక జనాభా, భౌగోళిక విస్తృతి ఉన్న భారత్ లాంటి దేశంలో  ఇంతటి విప్లవాత్మకమైన నిర్ణయం అమలు చేయటం మాత్రం సామాన్యమైన విషయం కాదు.  జీఎస్టీ అమలులోకి రావటంతో దేశంలోని వివిధ వస్తువులు, సేవలపై 15 వందల వేర్వేరు స్లాబ్ రేట్లకు గుడ్‌ బై చెప్పినట్లైంది. ఇక నుంచి కేవలం నాలుగు స్లాబ్‌లలో మాత్రమే వస్తు సేవలపై పన్నులు అమలు అవుతాయి. కేంద్రం విధించే ఎక్సైజ్,  సేవల పన్నులు కానీ… రాష్ట్రాలు విధించే వ్యాట్ కానీ ఇక నుంచి ఉండవు. రాష్ట్రాలు విధించే 17 రకాల పన్నులు మాయమవుతాయి. నిత్యావసర వస్తువులకూ, విలాస వస్తువులకూ వేర్వేరు రేట్లలో పన్నులు ఉంటాయి. వ్యవసాయంపై ఎలాంటి జీఎస్టీ ఉండదు.

నిజానికి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అవలంబించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. దాదాపు 17సంవత్సరాల క్రితం నుంచి దీనిపై ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని పరిశీలించేందుకు 2000 సంవత్సరంలోనే వాజపేయి ప్రభుత్వం అప్పటి బెంగాల్ ఆర్థిక మంత్రి అసీమ్‌ దాస్‌గుప్తా నేతృత్వంలో సాధికారిక కమిటీని ఏర్పాటు చేశారు. ఐతే యూపీఏ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై సీరియస్‌ గా దృష్టి పెట్టింది. పన్ను వ్యవస్థ స్థానంలో జీఎస్టీని విధించాలని 2004లో అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహాదారు విజయ్ కేల్కర్ సూచించారు. 2010 ఏప్రిల్ 1 కల్లా దేశమంతా జీఎస్టీని అమలు చేయాలన్న బృహత్తర లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నట్లు 2006 లోనే అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు.

జీఎస్టీకి ఒక భవిష్యత్ చిత్రపటాన్ని రూపొందించే బాధ్యతను ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీకి అప్పగించినట్లు 2007 ఫిబ్రవరి 28న చిదంబరం మరో సారి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ మేరకు ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ 2008 ఏప్రిల్ 30న నివేదిక సమర్పించింది. జీఎస్టీ పై ప్రజలను చర్చకు ఆహ్వానిస్తూ సాధికారిక కమిటీ 2009 నవంబర్ 10న బహిరంగంగా పిలుపునిచ్చింది. 2010 ఫిబ్రవరిలో ప్రభుత్వం వాణిజ్య పన్నుల కంప్యూటరీకరణకు ప్రాజెక్టును ప్రారంభించింది. ఆనాడు ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ 2011 ఏప్రిల్ 1 వరకు జీఎస్టీని వాయిదా వేశారు.

ఆ తర్వాత మళ్లీ 2011 మార్చి 22న జీఎస్టీ అమలు చేసేందుకు 115వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. 2011 మార్చి 29న ఈ బిల్లును స్థాయీ సంఘానికి నివేదించారు. 2012 డిసెంబర్ 31 నాటికి అన్ని అంశాలను పరిష్కరించుకోవాలని 2012 నవంబర్ లో జరిగిన ఆర్థికమంత్రి, రాష్ట్రాల మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. జీఎస్టీని అమలు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని 2013 ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి ప్రకటించారు. బడ్జెట్ లో రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేటాయింపులు కూడా చేశారు. 2013లో పార్లమెంట్ స్థాయీ సంఘం కొన్ని మార్పులను సూచిస్తూ నివేదిక సమర్పించింది. ఐతే 15వ లోక్ సభ రద్దు కావడంతో ఈ బిల్లుకు పెండింగ్ లో పడింది. యూపీఏ హయాంలోనే ఈ జి.ఎస్‌.టి ఆమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ…ప్రభుత్వం తాత్సారం చేయటంతో బిల్లుకు కాలదోషం పట్టింది.

ఐతే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జి.ఎస్‌.టి తీవ్రంగా వ్యతిరేకించిన నరేంద్రమోడీ…ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం మనసు మార్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీఎస్టీపై చర్యలను వేగవంతం చేశారు. 2014 డిసెంబర్ 18న జీఎస్టీపై రాజ్యాంగ సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించింది. 2014 డిసెంబర్ 19న ఈ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2015 మే 6న బిల్లుకు ఆమోదం లభించింది. 2015 మే 12న ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2015 మే 14న బిల్లును ఉభయ సభల సంయుక్త కమిటీకి నివేదించారు. రాజ్యసభలో సరైన మెజారిటీ లేనందువల్ల 2015 ఆగస్టులో జీఎస్టీకి బిల్లుకు అనుకూలంగా ప్రభుత్వం ప్రతిపక్షాల మద్దతును సమీకరించలేకపోయింది. వాస్తవానికి ఈ బిల్లు యూపీఏ సర్కార్‌ లో రూపొందించబడింది. కానీ బిల్లు విషయంలో  ప్రధాని మోడీ వ్యవహారిస్తున్న తీరు నచ్చకపోవటంతో కాంగ్రెస్ రాజ్యసభలో మద్దతు ఇవ్వలేదు. ఆ తర్వాత పలుమార్లు చర్చలు, సంప్రదింపుల తర్వాత 2016 ఆగస్టు 3న రాజ్యసభ జీఎస్టీపై రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది.

జీఎస్టీకి చెందిన అత్యంత కీలకమైన అనుబంధ బిల్లులను లోక్ సభ 2017 మార్చిలో ఆమోదించగా, రాజ్య సభ ఏప్రిల్ 6న ఆమోదించింది. దీనితో దేశంలో ఒకే పన్ను వ్యవస్థను ఏర్పర్చేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఆమోదించినట్లయింది. ఐతే మొత్తం నాలుగు స్లాబ్‌ లు 5,12,18, 28 శాతం  పన్నుల వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఏర్పాటైన జీఎస్టీ కౌన్సిల్‌ పలుమార్లు సమావేశమై…పన్నుల స్లాబ్ ను ఒక రూపానికి తెచ్చారు. ఈ ఒక్క చర్యతో భారత దేశం, సులభంగా వ్యాపారం చేసే దేశాల్లో ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్‌ను విపరీతంగా పెంచుకోనుంది.  జీఎస్టీ అమలు తర్వాత జీడీపి పెరుగుదల 1.5 నుంచి 2 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అసలు జీఎస్టీ కారణంగా ప్రయోజనమేమిటి అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ఐతే దీని వల్ల దేశంలోని అన్ని వర్గాలకు అంటే లబ్ది చేకూరుతుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థలో ఇన్‌ కం ట్యాక్స్ వంటి ప్రత్యక్ష పన్నులు తక్కువ జనాభాకే సంబంధించినవి. ఐతే జనమంతా  ఏదో రూపంలో పరోక్ష పన్ను చెల్లిస్తున్నా వారే. ఐతే ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరుగా వివిధ వసూలు చేసేవి. ఐతే  జీఎస్టీ అమలు ద్వారా రెండు పన్నులు ఇందులోనే కలిసి ఉంటాయి. ఇక  నిత్యావసరాల లాంటి వస్తువుల మీద పన్నే ఉండదు. నిత్యం వినియోగించే కొన్ని పన్నులు తక్కువ పరిధి ట్యాక్స్ స్లాబ్ లోకి వస్తాయి. ఇక అంతరాష్ట్ర సరిహద్దులో ఆక్ట్రాయ్‌, ఎంట్రీ ట్యాక్స్ ఉండదు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులు పోటీ పడే స్థాయిలో ఉంటాయి. ఈ ఏకీకృత పన్ను కారణంగా  అంతిమంగా వినియోగదారులకు మేలు జరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అటు జీఎస్టీ వల్ల పన్నుల ఎగవేతకు కూడా అవకాశం ఉండదు. దీంతో ప్రభుత్వ ఆదాయం కూడా పెరగనుంది. అటు ప్రజలకు మేలు జరిగే అవకాశంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో యూపీఏ.. ఎన్డీఏ సర్కార్లు ఈ బిల్లుకు కోసం కృషి చేశాయి. ఐతే ప్రస్తుతం జనంలో మాత్రం జీఎస్టీ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఈ ప్రక్రియ సక్రమంగా సాగేందుకు మరికొన్ని నెలలు పట్టే అవకాశమైతే ఉంది.