దగాపడ్డ రైతులకు దన్నుగా నిలుస్తున్నాం

వచ్చే ఏడాది నుంచి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టాలని, వ్యవసాయ రంగానికి నిధులు కూడా భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా  2,500 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతీ క్లస్టర్ లో రైతులు ఎప్పటికప్పుడు సమావేశం కావడానికి వీలుగా రైతు వేదికలు నిర్మించనున్నట్లు సిఎం ప్రకటించారు. సంఘటిత శక్తిలో ఉన్న బలమేంటో రైతులకు వివరించి, వారిని సంఘటితం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. రైతు సంక్షేమం-వ్యవసాయాభివృద్దిపై హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి విస్తృత సమీక్ష నిర్వహించారు.

వ్యవసాయంలో ఉత్పాదకత పెంచేందుకు అనుసరించాల్సిన ఆధునిక, శాస్త్రీయ పద్దతులపై అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో మూడింట రెండు వంతుల మంది ఆధారపడిన వ్యవసాయ రంగం మరింత విస్తరించాల్సి ఉందని, దీనికోసం వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని చెప్పారు. అవసరమైతే రిటైర్డ్ వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సేవలు కూడా ఉపయోగించుకోవాలని సిఎం సూచించారు. గ్రామాల్లో భూ రికార్డులు సక్రమంగా నిర్వహించేందుకు, కల్తీ నివారణకు ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నది సిఎం వెల్లడించారు.

‘‘సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు దగా పడ్డారు. రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతమయినా తెలంగాణ రైతులు సాగునీటికి గోస పడ్డారు. కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకని నరకం అనుభవించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ దుస్థితి పోవాలని నిర్ణయించాం. అందుకే వ్యవసాయంపైన, సాగునీటి రంగంపైనా దృష్టి పెట్టాం. ఫలితాలు సాధిస్తున్నాం. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకుంటున్నాం. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తును 9గంటల పాటు అందిస్తున్నాం. భవిష్యత్తులో 24 గంటలు కరెంటు ఇస్తాం. 17వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నం. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున ఎఇవోలను నియమించాం. వ్యవసాయ శాఖలో ఖాళీలను భర్తీ చేశాం. ప్రతీ మండల వ్యవసాయాధికారిని అగ్రానమిస్టుగా తయారు చేస్తున్నాం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తేవడానికి చర్యలు తీసుకున్నాం. వచ్చే ఏడాది నుంచి రెండు పంటల పెట్టుబడికి గాను రూ.8 వేలు అందిస్తున్నాం. యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, పాలీహౌజ్ కల్టివేషన్ ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నాం. వీటికి తోడు మరిన్ని చర్యలు చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నాం” అని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో వివరించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు ఎస్. నర్సింగ్ రావు, పార్థసారథి, శాంత కుమారి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిభాయి, వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.