త్వరలో రైతులతో సీఎం సమావేశం

రాష్ట్రంలోని రైతులకు మరింత భరోసా కల్పించేందుకు వచ్చే ఏడాది నుంచి అమలుచేయనున్న పెట్టుబడి పథకం, రైతు సంఘాల ఏర్పాటు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలోనే రైతులతో సమావేశమవుతారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రతి జిల్లా నుంచి వంద మంది ప్రగతిశీల రైతులను ఈ సమావేశానికి ఎంపిక చేశామని ఆయన తెలిపారు. గ్రామ రైతుసంఘాల ఏర్పాటు, రైతులకు పెట్టుబడికి ప్రతి సీజన్‌కు ఎకరాకు నాలుగు వేలు ఇవ్వడం సహా పలు అంశాలపై సీఎం కేసీఆర్ స్వయంగా మూడు వేల మంది రైతులతో మాట్లాడుతారని తెలిపారు. ప్రగతిభవన్‌లో మొత్తం మూడు ధపాల్లో ఈ సమావేశాలు త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు. అదే విధంగా క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులను నియమిస్తున్నామని, కొత్తగా భర్తీచేయబోతున్న పోస్టులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఏఈఓల సంఖ్య 2, 638కి చేరబోతున్నదని తెలిపారు.వారంలోపు రైతు సమగ్రసర్వే వివరాలు మా భూమి-మా పంట పోర్టల్‌లో పొందుపర్చాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్ని జిల్లాల వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. రైతు సమగ్రసర్వే, పంటల బీమా పథకం సహా పలు అంశాలపై ఆయన అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.