తెలంగాణ ఆకుపచ్చ వనంగా మారుతుంది

ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే తెలంగాణ ఆకుపచ్చ వనంగా మారుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భాగ్యనగరంలో మూడో విడత హరితహారానికి మంత్రి కేటీఆర్ శ్రీకారం చూట్టారు. వివిధ డివిజన్లలో పర్యటించి హరితహారంలో ప్రజలను భాగస్వాముల్ని చేశారు. స్వయంగా మొక్కలు నాటి హరితహారంపై అందరికీ అవగాహన కల్పించారు.

కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర బర్డ్స్‌ పార్క్‌లో 7 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ స్వయంగా మర్రి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి నాయిని, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. స్థానిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్దెత్తున మొక్కలు నాటారు. విద్యార్థులు మొక్కలు నాటడాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించారు. దేశం మొత్తం 50 కోట్ల మొక్కలు నాటుతుంటే, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మూడో దశ కింద 47 కోట్ల మొక్కలు నాటుతున్నామని కేటీఆర్ తెలిపారు.

అనంతరం చందానగర్‌ పీజేఆర్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో విద్యార్థులతో కలిసి మంత్రి కేటీఆర్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎంపీలు డి.శ్రీనివాస్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, పలువురు కార్పోరేటర్లు పాల్గొన్నారు. తర్వాత హైదర్‌నగర్‌ డివిజన్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. నాగార్జున హోమ్స్‌ రోడ్డులో పాఠశాల విద్యార్థులతో కలిసి హరితహారంలో పాల్గొన్నారు. తర్వాత భాగ్యనగర్‌ మూడో ఫేస్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. కాలనీవాసులతో సమావేశమై, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఆ తర్వాత హెచ్ఎంటీ శాతవాహన కాలనీ కమ్యూనిటీ హాల్ పరిసరాల్లో మొక్కలు నాటారు.

హరితహారం కార్యక్రమం మానవ చరిత్రలోనే అతిపెద్ద మూడో ప్రయత్నమన్నారు మంత్రి కేటీఆర్. భవిష్యత్ తరాల కోసమే సీఎం కేసీఆర్ హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు.

మూడో విడత హరితహారాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఇంట్లో ప్రతి ఒక్కరూ తమ పేరుతో ఒక మొక్కను పెంచాలని పిలుపునిచ్చారు.