తమిళనాడు రైతులకు సుప్రీం షాక్

రుణమాఫీ విషయంలో తమిళనాడు రైతులకు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. రుణమాఫీ చేయాలంటూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.  కో ఆపరేటివ్ బ్యాంకుల్లో రైతులు తీసుకున్నరుణాలను మాఫీ చేయాలని రెండు నెలల క్రితం మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై తమిళనాడు  ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో… అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.  ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తూ గతంలో తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రుణమాఫీని అందరికీ వర్తింప జేయాలని రైతు సంఘాలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో…. వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ మద్రాస్ హైకోర్టు తీర్పుతో ఆర్ధిక పరమైన ఇబ్బందులు వస్తాయని అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం, సుప్రీం కోర్టును ఆశ్రయించింది.