డ్రగ్స్ మత్తులో జోగుతున్న టాలీవుడ్‌

హైదరాబాద్‌ పోలీసులు.. టాలీవుడ్ డ్రగ్స్ మత్తును వదలిస్తున్నారు. తెలుగు చిత్రసీమను కలవరపరుస్తున్న డ్రగ్స్‌ కేసు.. గుట్టు విప్పేందుకు స్పెషల్‌ టాస్క్‌ పోర్స్‌ రెడీ అయింది. కాల్ లిస్ట్ కదిలించిన కొద్దీ, ప్రముఖుల  పేర్లు బయటపడుతున్నాయి. డైరెక్టర్ మొదలుకొని హీరోలు, హీరోయిన్లు, డాన్సర్లు, ఆర్టిస్టులు డ్రగ్ నెట్ వర్క్‌ లో ఉన్నట్టు ఆధారాలతో  సహా  తేలింది.  ముఠాలో కొందరు సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కూడా  ఉన్నట్టు గుర్తించారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని.. అందరి మత్తును వదిలిస్తామని టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ అంటున్నారు.

చాపకింద నీరులా  ఉన్న  డ్రగ్ మాఫియా  భరతం పట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పకడ్బందీగా  ప్లాన్ వేసింది. మెరికల్లాంటి ఆఫీసర్లతో  కూడిన ఐదు టీమ్‌లు రౌండ్ ద క్లాక్ పని చేస్తున్నాయి. ఇప్పటిదాకా  12 మందిని అరెస్ట్ చేశారు. వెయ్యి యూనిట్ల డ్రగ్స్‌  స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వాళ్ల దగ్గర  సేకరించిన సమాచారం ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మందే డ్రగ్‌ నెట్‌వర్క్‌ లో ఉన్నట్టు తేలింది. ఇటీవల డ్రగ్స్‌ రాకెట్‌ లో దొరికిన నిందితుల కాల్‌ డేలాను పరిశీలించగా.. అనేక మంది పేర్లు బయటపడ్డాయి. గత ఐదారు రోజుల నుంచి టాలీవుడ్ మీద దృష్టి సారించిన టాస్క్ ఫోర్స్.. ఆధారాలు గట్టిగానే సేకరించింది. ఇండస్ట్రీలో డైరెక్టర్ మొదలుకొని హీరోలు, హీరోయిన్లు, డాన్సర్లు, ఆర్టిస్టుల  పేర్లున్నట్టు సమాచారం. పక్కా అవిడెన్స్  ఉన్న  సినిమా పర్సనాలిటీలకు ఇప్పటికే నోటీసులు అందజేశారు. వాళ్లంతా  ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో టాస్క్‌ ఫోర్స్‌ ముందు హాజరుకావాలని ఆదేశించారు. అయితే సినిమా రంగానికి చెందిన వారిని డ్రగ్స్‌ ముఠా వాడుకున్నదా.. లేదా  నేరుగా  సంబంధాలు ఉన్నాయా  అనేది విచారణలో తేలుతుందన్నారు.

పేరు మోసిన డ్రగ్స్‌ వ్యాపారి కెల్విన్‌ కాల్‌ లిస్ట్ ఆధారంగా.. చిత్రసీమకు చెందిన పలువురి పేర్లు బయటపడ్డాయి. ప్రస్తుతం నోటీసులు అందుకున్న వారంతా.. కెల్విన్‌ తో కాంటాక్ట్‌ లో ఉండి.. డ్రగ్స్‌ ను కొనుగోలు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌ మెంట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు.  ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ పోలీసులకు కొకైన్ ముఠా  చిక్కింది. అనీష్, అగర్వాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఇంటర్నెట్ ద్వారా  ఎల్‌ఎస్‌డీ డ్రగ్  అమ్ముతూ పట్టుబడ్డారు. వాళ్ల దగ్గర్నుంచి నెదర్లాండ్స్ స్టాంపులతో  కూడిన ఎల్‌ఎస్‌డీలను (LSD) స్వాధీనం చేసుకున్నారు.

మరో వైపు కొందరు సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కూడా  డ్రగిష్టుల జాబితాలో ఉన్నారు. వాళ్ల వివరాలను ఐటీ  సెక్రటరీ జయేశ్ రంజన్‌కు ఇచ్చారు. హోటళ్లు, పబ్బులకు కూడా  నోటీసులు జారీ చేశారు. ఏక్షణమైనా  రైడింగ్  చేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు.ఇప్పటికే  26  స్కూళ్లకు,  27 కాలేజీలకు సలహాలు సూచనలతో  కూడిన లేఖలు పంపారు.