డ్రగ్స్ సప్లై మూలాలపై దృష్టి పెట్టాం

టీనేజ్‌ విద్యార్థుల నుండి కాలేజీ విద్యార్థులు, సినీ నిర్మాతల వ‌ర‌కు డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్లు గుర్తించామని ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. వాట్సాప్ గ్రూపుల‌తో పాటు, మెయిల్స్ ద్వారా డ్ర‌గ్ స‌ప్లై చేసే వారితో కాంటాక్టు అవుతున్నారని తెలిపారు. డార్క్ వెబ్ సైట్ ద్వారా డ్ర‌గ్ స‌ప్లై అవుతున్న‌ట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ ను పట్టుకుని భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న వివరాలను ఆయన మీడియాకు వివరించారు.

ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ప‌నిచేస్తున్న నలుగురిని రాత్రి అరెస్ట్ చేశామని, వారి వ‌ద్ద నుండి 100 ఎల్ఎస్ డీ డ్ర‌గ్ ను స్వాధీనం చేసుకున్నామని అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురిని అరెస్ట్ చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయని, రేపటి వరకు ఇంకా చాలామందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. ఈ కేసు దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశామని, దర్యాప్తు చురుగ్గా సాగుతోందని చెప్పారు. డ్రగ్ స‌రఫరాదారుల పేర్లు బ‌య‌టికి వ‌స్తే వారు త‌ప్పించుకునే అవకాశం ఉందన్నారు.

డ్రగ్స్ ప్రధాన సరఫరాదారులు ఎవ‌రు అనేదానిపై  తాము ఫోక‌స్ పెట్టామని, మూలాలు తెలిస్తే డ్ర‌గ్ ను హైద‌రాబాద్ కు రాకుండా క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చన్నారు అకున్. డ్ర‌గ్ తీసుకుంటున్న వారే స‌ప్లై దారులుగా కూడా ఉన్నారని, హైద‌రాబాద్ లో వారు వంద‌ల సంఖ్య‌లో ఉన్న‌ట్లు గుర్తించామని వెల్లడించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్ చేసిన వారి వ‌ద్ద నుండి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అకున్ సబర్వాల్ తెలిపారు. కాల్ డేటా ఆధారంగా ఎంత మంది డ్ర‌గ్స్ తీసుకుంటున్నారు అనే విష‌యాలు తేలుస్తామన్నారు.

విద్యార్థుల ప‌ట్ల వారి త‌ల్లిదండ్రులు అప్ర‌మ‌త్తంగా ఉండాలని అకున్ సూచించారు. వారి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పులు క‌నిపిస్తే అప్ర‌మ‌త్తంగా వ్య‌వహ‌రించాలని కోరారు. ఇంట‌ర్ నేష‌న‌ల్ స్కూల్స్, కాలేజీలు, ఇత‌ర స్కూల్స్ ప్రిన్సిప‌ల్స్ కు నోటీసులు పంపించామని తెలిపారు. స్కూల్ ప‌రిసర ప్రాంతాల్లో ఫోక‌స్ పెట్టాల‌ని, అనుమానితులు ఎవ‌రు క‌నిపించినా స‌మాచారం ఇవ్వాల‌ని చెప్పామని వెల్లడించారు. డ్రగ్స్ తీసుకునే విద్యార్థులు ఇప్పటికైనా తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సమాచారం ఇస్తే వారి పేర్లు బయట పెట్టం అన్నారు.