డ్రగ్స్ కేసులో మరొకరి అరెస్ట్

డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్ టీమ్ హైదరాబాద్ లో మరొకరిని అరెస్ట్ చేసింది. ఈవెంట్ మేనేజర్ పియూష్ ని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టింది.

పీయూష్. పైకి అతనొక ఈవెంట్ మేనేజర్‌. కానీ అసలు బిజినెస్- డ్రగ్స్ సరఫరా చేయడం.  ఇంకా విచిత్రం ఏంటంటే అవన్నీ ఇంట్లోనే తయారు చేసేవాడు. ఇంటర్నెట్ సాయంతో రకరకాల ఫార్ములాలు, కాంబినేషన్లతో ఎల్‌ఎస్‌డీ రూపొందించేవాడు . ఇద్దరు మధ్యవర్తుల సాయంతో అమ్ముతూ యాంటీ నార్కోటిక్ టీంకి దొరికిపోయాడు!

ఈవెంట్ మేనేజర్‌గా చెలామాణి అవుతూ చాటుమాటుగా డ్రగ్స్ సరఫరా చేసే పీయూష్ అరెస్ట్ అయ్యాక మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతని దగ్గర ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ 80 వరకు దొరికాయి. అవి ఒక్కోటి రూ. 2,500 నుంచి రూ. 4,000 దాకా ఉంటాయి. వాటితో పాటు 2,700 ఇమిటేషన్‌ ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ కూడా ఉన్నాయి. వైట్ పౌడర్ 40 గ్రాములు, వెన్లార్ ఎక్స్ఆర్ 75 ఎంజీ 4 క్యాప్సూల్స్, వెన్లార్ ఎక్స్ఆర్ 150 ఎంజీ 5  క్యాప్సూల్స్, పెనెగ్రా 25 గ్రాములు నాలుగు టాబ్లెట్లు, యాక్సెప్టా 10 ఎంజీ రెండు టాబ్లెట్లు,  ఒక లాప్ టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

పీయూష్ పూర్వీకులది పంజాబ్. రెండు తరాల కిందటే హైదరాబాదులో సెటిల్ అయ్యారు. తండ్రి బీహెచ్‌ఈఎల్ ఉద్యోగి. తాతలు ఆర్మీలో పనిచేశారు. ఇతను ఇంజినీరింగ్ చదివేటప్పుడే గంజాయికి అలవాటు పడ్డాడు. స్ట్రక్చరల్ ఇంజినీర్‌గా పనిచేశాడు. డిమానిటైజేషన్ సమయంలో ఉద్యోగం పోయింది. ఆ డిప్రెషన్‌లో ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే ఎల్‌ఎస్‌డీ గురించి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాడు. విదేశాల నుంచి వాటిని తెప్పించుకున్నాడు. ఆ క్రమంలోనే పీయూష్‌కి ఒక ఐడియా వచ్చింది. అచ్చం ఎల్‌ఎస్‌డీ లాంటి డ్రగ్‌నే తయారు చేసి డబ్బులు సంపాదించాలని స్కెచ్ గీశాడు. ఎల్‌ఎస్‌డీ వాడితే ఎలాంటి ఎఫెక్టులు ఉంటాయో నెట్‌లో స్టడీ చేశాడు. అలాంటి సిమిలర్ ఎఫెక్టులు ఉండేలా కొన్నిరకాల డ్రగ్స్ ని గుర్తించాడు. తలనొప్పి, స్ట్రెస్ రిలీఫ్ టాబ్లెట్లను రకరకాల కాంబినేషన్‌లో కలిపి, ఇంట్లోనే ఇమిటేషన్ ఎల్‌ఎస్‌డీ తయారు చేశాడు. యాడీ, విజయ్‌ అనే ఇద్దరు ఫ్రెండ్స్ సాయంతో వాటిని సేల్ చేసేవాడు.

గతంలో సీజ్ చేసిన కేసుల్లో పీయూష్‌కి సంబంధం లేదని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. అతనితో ఫిల్మ్ ఇండస్ట్రీ లింకుల గురించి ఇప్పుడప్పుడే చెప్పలేం అంటున్నారు. అన్ని వయసుల వారికి డ్రగ్స్ సప్లయ్ చేసి వుంటాడని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన కెల్విన్‌ తో పీయూష్‌కి ఎలాంటి సంబంధం లేదని కూడా అంటున్నారు.