డిప్యూటీ గవర్నర్‌ పోస్టుకు 90 దరఖాస్తులు

రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా డిప్యూటీ గవర్నర్‌ పోస్టుకు దాదాపు 90 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రస్తుత డిప్యూటీ గవర్నరు ఎస్‌ఎస్‌ ముంద్ర మూడేళ్ల పదవీకాలం ముగియనుండంతో ఆయన స్థానంలో ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుకు పలు ప్రైవేటు బ్యాంకర్లు కూడా దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి షార్ట్‌లిస్టు చేసి తుది ఎంపిక కోసం పేర్లను ఎఫ్‌ఎస్‌ఆర్‌ఏఎస్‌సీ (ఫైనాన్షియల్‌ సెక్టార్‌ రెగ్యులేటరీ అపాయింట్‌మెంట్‌ సెర్చ్‌ కమిటీ)కు పంపిస్తారు. రిజర్వు బ్యాంకుకు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఇద్దరు రిజర్వు బ్యాంకు స్థాయిలో పనిచేసిన అధికారులయితే, ఒకరు వాణిజ్య బ్యాంకర్‌, మరొకరు ఆర్థికవేత్త ఉంటారు. దరఖాస్తుదారులకు పూర్తికాల డైరెక్టరు లేదా బోర్డు సభ్యుడిగా అనుభవం ఉండాలి. జులై 31, 2017 నాటికి 60ఏళ్లు మించకూడదు. ఆర్‌బీఐ గవర్నరుగా ఎంపికైతే మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. అవసరమైతే వాళ్లను పునర్‌ నియామకం చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నరుకు నెలకు రూ.2.25లక్షలు వేతనం, ఇతర అలవెన్సులు ఉంటాయి.