డార్జిలింగ్‌లో కొనసాగుతున్న హింస

గూర్ఖాలాండ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ చేపట్టిన ఉద్యమం రగులుతూనే ఉంది. డార్జిలింగ్‌లోని కుర్సెవోంగ్‌లో పంచాయతీ కార్యాలయాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. ఓ ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేశారు. గూర్ఖా జన్‌ముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక బంద్‌ 31వ రోజుకు చేరుకుంది. డార్జిలింగ్‌, సోనాడా, కలింపాంగ్‌లలో సైనిక బలగాలు మొహరించినప్పటికీ హింస ఆగడం లేదు. చౌక్‌బజార్‌ ప్రాంతంలో జీజేఎం మద్దతుదారులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఔషధ దుకాణాలు తప్ప మిగతావన్నీ మూతపడటంతో నిత్యావసరాల కొరత తీవ్రమవుతోంది. దీంతో జీజేఎంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు ఆహార పదార్ధాలు సరఫరా చేశాయి.