ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ మూల్యం!

ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే బారీ మూల్యం తప్పదంటున్నారు హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు.. కొత్తగా పెనాల్టీ పాయింట్స్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. తెలంగాణ మోటార్‌ వెహికల్‌ చట్టం 1989 లోని 45 A (1), 45 A (6) లకు సవరణ చేస్తూ.. ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయనున్నారు. ఇక నుంచి ప్రతి ఉల్లంఘనను పాయింట్స్ రూపంలో ఇస్తూ.. 12 పాయింట్లకు చేరితే, ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి ఖాతాలో రెండేళ్లలో మరోసారి 12 పాయింట్లు నమోదైతే..  డ్రైవింగ్ లైసన్స్ అనుమతిని రెండేళ్ల పాటు సస్పెండ్‌ చేయనున్నారు. మూడో దఫా నుంచి 12 పాయింట్లు దాటిన ప్రతి సందర్భంలోనూ.. మూడేళ్ల పాటు సస్పెండ్‌ చేయనున్నారు. లెర్నింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లకైతే 5 పాయింట్స్ దాటితేనే రద్దు చేస్తామని చెబుతున్నారు పోలీసులు.

మద్యం తాగి వాహనం నడిపితే టూ వీలర్‌కి 3 పాయింట్లు, ఫోర్ వీలర్‌కి 4 పాయింట్లు.. బస్, క్యాబ్‌కి 5 పాయింట్లు నమోదు చేస్తారు. సిగ్నల్ జంప్‌కి 2 పాయింట్లు, అతివేగానికి 3 పాయింట్లు, రేసింగ్ చేసే వాహనదారులకు 3 పాయింట్లు, ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లు నమోదు చేస్తారు. అదేవిధంగా సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుంటే 1 పాయింట్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లను నమోదు చేస్తారు పోలీసులు.

నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండు రకాలుగా జరిమానాలు విధిస్తుంటారు ట్రాఫిక్‌ పోలీసులు. రోడ్లపై వాహనాలను ఆపి.. పీడీఏ మిషన్ల ద్వారా చెక్ చేయడం మొదటి పద్ధతి. ట్రాఫిక్ రూల్స్‌ అతిక్రమించిన వాహనదారుడిని కెమెరాల ద్వారా షూట్‌ చేసి, ఆర్టీఏ డేటాబేస్‌లో ఉన్న చిరునామా ఆధారంగా ఈ–చలాన్‌ పంపడం రెండో రకం. అయితే పోలీసులు తనిఖీలు చేసినప్పుడు మాత్రమే ఈ పాయింట్స్‌ను లెక్కలోకి తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెనాల్టీ పాయింట్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకు రానున్నారు ట్రాఫిక్ పోలీసులు. దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లో పెనాల్టీ పాయింట్ అమల్లోకి వస్తోంది.