నెత్తురోడిన అమర్‌నాథ్ యాత్ర

పవిత్ర అమర్ నాథ్ యాత్రికులపై ఉద్రవాదులు పంజా విసిరారు. అత్యంత అమానుషంగా దాడి చేసి ఏడుగురు యాత్రికుల ను పొట్టనబెట్టుకున్నారు. జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ లో  ఉగ్రవాదులు  జీజే09జెడ్ 9976 నంబరు  గల గుజరాత్ బస్సు పై దాడికి పాల్పడ్డారు. అంతకు ముందు భద్రతాదళాల బంకర్ పై దాడి చేసిన ఉగ్రవాదులు ..యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా.. దాదాపు 32 మందికి గాయాలయ్యాయి.. ఇక  సాయంత్రం 7 గంటల తర్వాత రోడ్డు మీదకు రావద్దన్న నిబంధనను ఆ బస్సు డ్రైవరు అతిక్రమించాడని అంటున్నారు. ఉగ్రదాడికి గురైన గుజరాత్‌కు చెందిన బస్సు ప్రధాన వాహనాల బారులో భాగం కాదని, ఆలయబోర్డు కార్యాలయంలో అది నమోదు కూడా చేసుకోలేదని తెలిసింది. దాడి నేపథ్యంలో కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జమ్ము-శ్రీనగర్ హైవేపై భద్రతను ముమ్మరం చేశారు. గుజరాత్‌కు చెందిన బస్సుపై దాడి జరిగిన దృష్ట్యా గుజరాత్ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

శాంతియుతంగా అమర్‌నాథ్ యాత్ర చేస్తున్న యాత్రికులపై జరిగిన  దాడిని ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. పరిస్థితిని స్వయంగా ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ దాడిని ఖండించేందుకు మాటలు చాలవని ఆయన అన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలతో, కుటిల పన్నాగాలతో భారత్‌ను కట్టిపడేయలేరని ఆయన పేర్కొన్నారు. అటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సైతం జమ్మూ ప్రభుత్వం తో చర్చలు జరిపారు… అన్నిరకాలుగా  సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అటు ఈ ఉగ్రదాడి మానవతపై జరిగిన దాడిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభివర్ణించారు. ఇక యాత్రికుల పై ఉగ్రదాడికి నిరసనగా జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ ఇవాళ జమ్ము బంద్‌కు పిలుపునిచ్చింది.

ఇక  గతంలోనూ అమర్ నాథ్ యాత్రికులపై 2000 ఆగస్టు 1న పహల్గాం వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..  ఆ దాడిలో  30 మంది మరణించారు.. ఈ మథ్యే తెలంగాణకు చెందిన యాత్రికుల బస్సుపైనా దాడికి పాల్పడ్డారు.