టీమిండియా హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి  

ఎట్టకేలకు టీమిండియా కోచ్ పై ఉత్కంఠ వీడింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న అనుహ్య పరిణామాలకు ఫుల్‌స్టాప్ పడింది. అందరూ అనుకున్నట్లుగానే టీమిండియా ప్రధాన కోచ్ పదవి రవిశాస్త్రికే దక్కింది. రవిశాస్త్రి ఎంపిక కు ముందు పలు నాటకీయ పరిణామాలు జరిగినా   క్రికెట్ పరిపాలన కమిటీ ఆదేశాలను గౌరవిస్తూ సలహా కమిటీ రవిశాస్త్రి ఎంపికకే మొగ్గు చూపింది. రానున్న రెండేండ్లకు గాను చీఫ్ కోచ్‌గా రవిశాస్త్రిని, బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ఖాన్, బ్యాటింగ్ సలహాదారునిగా రాహుల్ ద్రవిడ్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బిగ్ త్రీ గంగూలీ, సచిన్, లక్ష్మణ్ సారథ్యంలోని సీఏసీ విస్తృత సంప్రదింపుల అనంతరం కోచ్ ఎంపిక ప్రక్రియ ముగిసింది. 2019 ప్రపంచకప్ విషయంలో శాస్త్రి ఆవిష్కరించిన విజన్ అందరిని ఆకట్టుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవమున్న రవినే  కోచ్‌గా నియమించినట్లు బీసీసీఐ తెలిపింది. 2019 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రి పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇక  బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ఖాన్ సేవలందించనున్నాడు. విదేశీ పర్యటనల్లో జట్టు బ్యాటింగ్ సలహాదారునిగా ద్రవిడ్ వ్యవహరించనున్నాడు. జాతీయ జట్టుతో కలిసి కొనసాగడం 55 ఏండ్ల రవికి ఇది మూడోసారి. తొలుత 2007 బంగ్లాదేశ్ పర్యటనలో క్రికెట్ మేనేజర్‌గా వ్యవహరించిన రవి.. తర్వాత 2014నుంచి 2016 వరకు టీమ్ డైరెక్టర్‌గా కొనసాగాడు. ఇతని పర్యవేక్షణలో టీమ్‌ఇండియా 2015 ప్రపంచకప్‌తో పాటు 2016 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది.

ఇక కోచ్ ఎంపిక ప్రక్రియలో కెప్టెన్ కోహ్లీ పంతం నెగ్గింది.  కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు ఇచ్చిన రవిశాస్త్రి వైపే బీసీసీఐ మొగ్గుచూపింది. కోచ్ ఎంపికపై ఆఖరి వరకు ఉత్కంఠ కొనసాగినా..అందరూ ఊహించినట్లుగానే శాస్త్రినే పదవి వరించింది. కెప్టెన్ కోహ్లీతో మాట్లాడాకే కోచ్‌ను ప్రకటిస్తామని సీఏసీ సభ్యుడు గంగూలీ ప్రకటించిన నేపథ్యంలో ఒకింత సందిగ్ధత ఏర్పడింది. అయితే పరిపాలన కమిటీ చీఫ్ కలుగజేసుకోవడంతో ఎంపిక ప్రక్రియ సజావుగా ముగిసింది. ఈనెల 26 నుంచి మొదలయ్యే శ్రీలంక పర్యటన తో కోచ్ గా రవిశాస్త్రీ  బాధ్యతలు స్వీకరించనున్నాడు.