టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం, స్పందించిన ఇండస్ట్రీ

తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం షేక్ చేస్తోంది. పోలీసుల విచారణలో తీగలాగినకొద్దీ టాలీవుడ్‌ డొంక కదులుతోంది. డ్రగ్స్ రాకెట్ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పది మందికి నోటీసులు జారీ చేశారు. ఆరు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రాకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. నోటీసులు అందుకున్నవారిలో ముగ్గురు యువ హీరోలు, నలుగురు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు, ఓ ఫైట్ మాస్టర్ ఉన్నారు. సినీ ఇండస్ట్రీతో పాటు మల్టీ నేషనల్ కంపెనీలకు డ్రగ్ రాకెట్ తో సంబంధాలున్నాయన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం కొత్తేమీ కాదు. చాలాకాలం నుంచే ఇండస్ట్రీలో మాదక ద్రవ్యాల వ్యవహారం నడుస్తోందన్న ప్రచారం ఉంది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, నిర్మాతలు తొలిసారి మీడియా సమావేశం పెట్టారు. పది, పదిహేను మంది వల్లే సినీ పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నవారి పేర్లన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, ఇప్పటికైనా వాళ్లు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. లేకుంటే తరువాత జరిగే పరిణామాలకు వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన పోలీసులు, ఇదే కేసుకు సంబంధించి మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 16 యూనిట్ల ఎల్ఎస్‌డీని స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో రీతుల్ అగర్వాల్ ని అరెస్ట్ చేశారు. దీంతో  డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 12కు చేరింది.