జెట్ స్పీడ్ లో ఎల్లంపల్లి- మిడ్‌మానేరు లిఫ్టుల పనులు

డిసెంబర్‌ నాటికి మిడ్‌మానేరులో గోదావరి జలాల గలగలలు వినిపించనున్నాయి. ఈ దిశగా ఎల్లంపల్లి- మిడ్‌మానేరు మధ్య లిఫ్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పంప్‌హౌస్‌ల నిర్మాణంతోపాటు 14 మోటర్ల బిగింపునకు నీటిపారుదల శాఖ కార్యాచరణ రూపొందించింది. వచ్చే ఏడాది వానాకాలం పంటకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరిజలాలను అందించాలన్న  సీఎం కేసీఆర్ ఆదేశంతో అధికారులు ప్రాజెక్టుల పనులలో వేగాన్ని మరింత పెంచారు. సివిల్ పనులతోపాటు ఎత్తిపోతలకు సంబంధించి పంపుహౌజ్‌లు, మోటర్ల బిగింపు వంటి పనులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

ఈ ఏడాది డిసెంబరుకే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు గోదావరి నీటిని తరలించే పనులను పూర్తిచేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇతర పంపుహౌజ్ పనులకు కూడా నిర్ణీత సమయాన్ని నిర్ధారించుకొని పనులు కొనసాగిస్తున్నది.సాగునీటి ప్రాజెక్టులంటే దశాబ్దాల ఎదురుచూపులు అనే గత చరిత్రను తిరగరాసే రీతిలో తెలంగాణ ప్రాజెక్టుల పనులు పరుగులు పెడుతున్నాయి. నీటిపారుదలశాఖ యంత్రాంగం అందుకు అనుగుణంగా పనుల వేగాన్ని పెంచుతున్నది.  సాధారణంగా ఎత్తిపోతల పథకాల్లో సివిల్ పనులతోపాటు పంపుహౌజ్‌లు, మోటర్ల బిగింపు అనేది చాలా కీలకం కాగా… తెలంగాణ ప్రభుత్వం సివిల్ పనుల పురోగతిని సమీక్షిస్తూనే లిఫ్టు పనులకు కూడా నిర్ణీత గడువును నిర్దేశిస్తున్నది.  అటు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు జలాలను తరలించేందుకు చేపడుతున్న ప్యాకేజీ-6, 8 పనుల్లో లిఫ్టులను డిసెంబరులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎల్లంపల్లి-మేడారం వరకు ఆరో ప్యాకేజీ కింద 125 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు పంపులు, కాకతీయ కాల్వ దాటిన తర్వాత ఎనిమిదో ప్యాకేజీ కింద 139 మెగావాట్ల సామర్థ్యంతో మరో ఏడు పంపులను అమర్చే పనులను పూర్తి చేయనున్నారు. వచ్చే జూన్ నాటికి మిడ్ మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు నీటి తరలింపునకు చేపడుతున్న ప్యాకేజీ-10 పనుల్లో భాగంగా సుమారు 124 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు పంపులు ఏర్పాటు చేయనున్నారు.

ఇక అనంతగిరి నుంచి రంగనాయకసాగర్ వరకు పనుల కోసం చేపడుతున్న ప్యాకేజీ-11 పనుల్లో సుమారు 134 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు పంపులు, రంగనాయకసాగర్ నుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్‌కు గోదావరిజలాలను తరలించేందుకుగాను చేపడుతున్న ప్యాకేజీ-12 పనుల్లో ఎనిమిది పంపుల ఏర్పాటు ప్రక్రియను వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.
అటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో గోదావరిపై నిర్మిస్తున్న మూడు బ్యారేజీలతోపాటు మూడు పంపుహౌజ్‌లు కీలకం కానున్నాయి. అయితే బ్యారేజీల పనులు కొంతమేర పూర్తయినా నీటిని లిఫ్టు చేసుకునే వెసులుబాటు ఉన్నందున..పంపులు సిద్ధంగా ఉంటే ఇప్పటికిప్పుడు గోదావరి నుంచి నీటిని లిఫ్టు చేసేందుకు ప్రయత్నించవచ్చని అధికారులు చెపుతున్నారు. అందుకే బ్యారేజీ పనులతో సంబంధం లేకుండా కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపుహౌజ్ పనులను అత్యంత ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేయాలని సీఎం సూచించారు.

అటు కన్నెపల్లి మేడిగడ్డ వద్ద 11 పంపులు, అన్నారం వద్ద ఎనిమిది పంపులు, సుందిల్ల వద్ద తొమ్మిది పంపుల ఏర్పాటు చేయాల్సి ఉన్నందున పంపుహౌజ్ పనులను శరవేగంగా చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికే మూడు చోట్ల 40 మెగావాట్ల సామర్థ్యంతో పంపులు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాస్త అటుఇటుగా ఇవి పూర్తయి అటు ప్యాకేజీ-10,11,12 పనులు జూన్‌లో పూర్తయితే మల్లన్నసాగర్ వరకు నిరాటంకంగా గోదావరిజలాలు పంపేందుకు మార్గం సుగమమవుతుంది. ఇక ఎల్లంపల్లి నుంచి వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తరలించేందుకు మూడు దశల్లో లిఫ్టుతో చేపడుతున్న పథకం టెండర్లు కూడా పూర్తయినందున వచ్చే ఏడాది జూన్ నాటికి పథకాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇక ఎన్నో ఏండ్లుగా నత్తనడకన సాగుతున్న పాలమూరు లిఫ్టులన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల్లో పంపుహౌజ్‌లు, పంపుల బిగింపు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి.