జీ-20 దేశాల అధినేతలతో ప్రధాని చర్చలు

జర్మనీలో హాంబర్గ్‌ లో జీ-20 సదస్సు వేదికను ప్రధాని నరేంద్రమోడీ చక్కగా వినియోగించుకున్నారు. పలు దేశాల అధినేతలు ఈ సమావేశానికి హాజరుకావటంతో ఇదే వేదికపై వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సౌత్‌ కొరియా అధినేత తో ముందుగా ప్రధాని మోడీ సమావేశమయ్యారు. రెండు దేశాల వ్యాపార, వాణిజ్య అంశాలు సహా సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చిపుచ్చుకునేందుకు పరస్పర అంగీకారం తెలిపారు.

అనంతరం ఇటలీ, బ్రిటన్‌, అర్జెంటీనా, వియత్నాం అధినేతలతోనూ ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో భారత్‌ కున్న వ్యాపార, వాణిజ్య సంబంధాలు, ఒప్పందాలపై చర్చించారు. నార్వే ప్రధాని ఎర్నా సొల్ బర్గ్‌ ప్రధాని మోడీకి ఫుట్‌బాల్ బహుమతిగా ఇచ్చారు. జీ-20 సదస్సులో తీర్మానించిన అంశాలను ఈ ఫుట్‌ బాల్‌ పై ముద్రించారు.  బ్రిటన్‌ ప్రధానితో సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ విజయ్‌ మాల్యా ప్రస్తావన తెచ్చారు. భారత్‌ లో బ్యాంకులకు రుణాలు ఎగవేసి… బ్రిటన్‌ పారిపోయిన మాల్యాను తమకు అప్పగించేందుకు సహకరించాలని ప్రధాని కోరారు.

చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ తో ప్రత్యేకంగా సమావేశం కానప్పటికీ శుక్రవారం ఆయనతో ప్రధాని మోడీ కాసేపు ముచ్చటించారు. భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను కాస్త తగ్గించాయి. అటు ఉగ్రవాదంపై బ్రిక్స్ దేశాల సదస్సులో మోడీ ప్రస్తావించిన అంశాలపై చైనా అధ్యక్షుడు స్పందించారు. టెర్రరిజం పై భారత్‌ చేస్తున్న పోరాటం ప్రశంసనీయమన్నారు.

జీ-20 దేశాల సదస్సుల్లో ప్రధానంగా వాతావారణ మార్పులు, ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, టెర్రరిజం అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలోనూ ప్రధాని మోడీ టెర్రరిజం కారణంగా ఎంత నష్టం జరుగుతుందో వివరించారు. వాతావారణ మార్పుల అంశంపై అమెరికా మినహా అన్ని దేశాలు ఒక్క తాటిపైకి వచ్చాయి.