జీఎస్టీ వేడుకలో బయట పడ్డ విపక్షాల విభేదాలు

పార్లమెంట్ సెంట్రల్ హాలు వేదికగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన జీఎస్టీ ప్రారంభ వేడుకలో పలు విపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావాలన్న విషయమై విపక్షాల్లో విభేదాలు బయట పడ్డాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడిగా అభ్యర్థిని నిలుపాలన్న 17 విపక్ష పార్టీల వ్యూహం బెడిసి కొట్టగా.. తాజాగా జీఎస్టీ అమలు కార్యక్రమంలోనూ వాటి ఐక్యతా రాగంలో డొల్లతనం బయటపడింది. జీఎస్టీ ప్రారంభ కార్యక్రమం ఒక తమాషాగా మారిందంటూ కాంగ్రెస్, తృణమూల్, కాంగ్రెస్, లెఫ్ట్, బీఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ సహా మరికొన్ని పార్టీలు వేడుకకు గైర్హాజరయ్యాయి. కానీ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్, పార్టీ సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, తారిఖ్ అన్వర్‌లతో కలిసి హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలతోపాటు మాజీ ప్రధాని, జేడీ (ఎస్) అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ వేదికను పంచుకున్నారు. ఎస్పీ నేతలు రాంగోపాల్ యాదవ్, నరేశ్ అగర్వాల్, జేడీయూ, బీజేడీ, అన్నాడీఎంకే నేతలు కూడా హాజరయ్యారు.