జీఎస్టీ మొబైల్ యాప్‌ రిలీజ్  

వస్తు, సేవల పన్నులపై(జీఎస్టీ) అనుమానాలను నివృత్తి చేయడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్(సీబీఈసీ) అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేశారు. ఏయే వస్తువుపై ఎంత పన్ను విధిస్తున్నారో తెలుసుకోవాలంటే జీఎస్టీ రేట్ ఫైండర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ పనిచేయడం ఈ యాప్ ప్రత్యేకత. ప్రజలు, వినియోగదారులు, ట్రేడర్లు, విద్యార్థులు ఎవరైనా జీఎస్టీ రేట్లకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు సీబీఈసీ చైర్‌పర్సన్ వనజ సర్నా తెలిపారు.  మార్కెట్‌కు లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడ విధించే పన్ను వివరాలు తెలిపేవిధంగా రూపొందించిన తొలి యాప్ ఇదేనని ఆమె తెలిపారు. ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే పనిచేస్తుందని, భవిష్యత్తులో ఐఫోన్లలోని ఐవోసీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా పనిచేసే విధంగా డిజైన్ చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. అలాగే సీబీఈసీ జీఎస్టీ వెబ్‌సైట్‌లో కూడా రేట్లకు సంబంధించిన సమాచారం లభించనున్నది. పన్ను చెల్లింపుదారులు.. సీజీఎస్టీ(సెంట్రల్ జీఎస్టీ), ఎస్‌జీఎస్టీ (రాష్ట్ర జీఎస్టీ), యూటీజీఎస్టీ(కేంద్ర పాలిత జీఎస్టీ) రేట్లతోపాటు సరఫరాపై పరిహార సెస్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చును. జీఎస్టీ అనుమానాలను నివృత్తి చేయడానికి ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది.