జీఎస్టీ అమలులో రాష్ట్రం ముందంజ

ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన జి.ఎస్.టి.ని అమలు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది. మొదటి పక్షం రోజుల్లోనే 90 శాతం మంది వ్యాట్ ఖాతాదారులను జి.ఎస్.టి. పరిధిలోకి తీసుకురాగలిగింది. తెలంగాణ వ్యాప్తంగా వ్యాట్ పరిధిలో ఉన్న 2.16 లక్షల మంది ట్రేడర్లలో 1.92 లక్షల మంది ట్రేడర్లు ఈ నెల 15 వరకు జి.ఎస్.టి.లో అనుసంధానమై నెంబర్లు పొందారు. ట్రేడర్లందిరినీ అధికారులు వ్యక్తిగతంగా కలిసి జి.ఎస్.టి. పరిధిలోకి తెచ్చారు. 15 రోజుల్లో ఇంతటి పురోగతి సాధించిన అతికొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.

జి.ఎస్.టి.పై చాలా రాష్ట్రాల్లో ఇంకా గందరగోళం, ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో, జి.ఎస్.టి.లో చేరడానికి వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఈ ప్రగతి సాధించడం గొప్ప విషయమని కేంద్ర ప్రభుత్వ అధికారులు కితాబునిచ్చారు. జి.ఎస్.టి. అమలు విషయంలో అపోహలు తొలగించి, ఇందులో ఉన్న సానుకూల అంశాలను ప్రజలకు, వ్యాపారులకు విడమరిచి చెప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన సూచనల మేరకు అధికార యంత్రాంగం కదిలింది.

జి.ఎస్.టి.తో లాభమా? నష్టమా? ఎవరికి లాభం? ఎంత నష్టం? ఏ వస్తువులపై ఎంత జి.ఎస్.టి. పడుతుంది? మొత్తంగా రాష్ట్రానికి లాభమా? నష్టమా? ఎంత శాతం?  తదితర విషయాలపై తీవ్ర సందిగ్ధత నెలకొన్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 3న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి, జి.ఎస్.టి.లోని సానుకూల అంశాలను ప్రజలకు విడమరిచి చెప్పాలని ఆదేశించారు. ముఖ్యంగా 20 లక్షల లోపు వ్యాపారం చేసుకునే వారికి ఎలాంటి పన్నులు పడవని, రూ.75 లక్షల లోపు వ్యాపారం చేసుకునే చిన్న వ్యాపారులకు కేవలం ఒక శాతం పన్ను మాత్రమే విధిస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జి.ఎస్.టి. ద్వారా చెల్లించే పన్నుల్లో సగం రాష్ట్ర ఖజానాకే వస్తుందని, దీని వల్ల రాష్ర్ట్రానికి మేలే తప్ప నష్టం జరగదని కూడా ఆ సమీక్షలో తేల్చారు. ప్రజల్లో అనవసర ఆందోళన పోగొట్టి, వాస్తవాలు చెప్పాలని సిఎం సూచించారు.

దీంతో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ నాయకత్వంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి ఈ వ్యూహాన్ని అమలు చేసే బాధ్యతలను తీసుకున్నారు.

వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని 91 సర్కిళ్ళలో ఉన్న ట్రేడర్లందరినీ అధికారులు స్వయంగా కలిశారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5,6,7 తేదీల్లో 51 అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.పి.సింగ్ స్వయంగా పంజాగుట్ట, అబిడ్స్ సర్కిళ్లలో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నారు. తాండూరులో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల సదస్సులో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బిఆర్ మీనా పాల్గొన్నారు. వరంగల్, నల్గొండ జిల్లాల్లో జరిగిన సదస్సుల్లో వాణిజ్య శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న వ్యాపారులకు జి.ఎస్.టి పై అధికారులు అవగాహన కల్పించారు. వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సందేహాలు నివృత్తి చేశారు. వ్యాట్ పరిధిలో ఉన్న ట్రేడర్లను అధికారులే దగ్గరుండి జి.ఎస్.టి పరిధిలోకి మార్పించారు. ఇంగ్లీషు, తెలుగులో కరపత్రాలు ముద్రించి ట్రేడర్లకు, ప్రజలకు అందించారు.

20 లక్షల లోపు వ్యాపారం నిర్వహించుకునే వారికున్న పన్ను మినహాయింపులు, 75 లక్షల లోపు వ్యాపారం చేసుకునే చిన్న వ్యాపారులకు కేవలం 1 శాతం పన్ను, వస్తువుల తయారీదారులకు కేవలం 2 శాతం పన్ను మాత్రమే విధిస్తారనే విషయాన్ని చెప్పారు. ఆహార వస్తువులతో పాటు పన్ను పడని విభాగంలో కూడా చాలా అంశాలున్నాయనే అంశాలను ప్రజల దృష్టికి తెచ్చారు. ఈ నెల 8,9 తేదీల్లో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర అధికారులతో రెండు రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఇందులో పాల్గొన్నారు.

11న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక సదస్సు నిర్వహించి జర్నలిస్టులకు కూడా అవగాహన కల్పించారు. ఈ నెల 13న ఫార్మా రంగానికి చెందిన ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. 14న కాంట్రాక్టర్లతో, 15న వినియోగదారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్, ఐటి, ఫైనాన్స్ సంస్థలు, హోటల్ యజమానులు, క్యాటరింగ్ రంగం, కమిషన్ ఏజెంట్లు, టెక్స్ టైల్ వ్యాపారులు, చిల్లర వర్తకులు, టోకు వర్తకులతో కూడా వరస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి 1800 425 3787 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల దాకా పనిచేస్తుంది. ఇప్పటి దాకా దాదాపు 3వేల మంది తమ సందేహాలను ఈ టోల్ ఫ్రీ నెంబరు ద్వారా నివృత్తి చేసుకున్నారు.

అధికారులకు సిఎం అభినందన: 
జి.ఎస్.టి.పై అవగాహన కల్పించి, వ్యాట్ ఖాతాదారులను గరిష్ట సంఖ్యలో జి.ఎస్.టి. లో రిజిస్టర్ చేయించడంలో విశేష కృషి చేసిన అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. అతి తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించారని వాణిజ్య శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు ఇతర అధికారులను అభినందించారు. ఈ నెలాఖరులోగా వంద శాతం రిజిస్ట్రేషన్ పూర్తి కావాలని చెప్పారు.

వస్త్ర పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, బీడీ పరిశ్రమ, ప్రజోపయోగ పనులకు సంబంధించిన జి.ఎస్.టి. విషయంలో రాయితీలు, మినహాయింపులు కోరామని, కేంద్రం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని సిఎం కేసీఆర్ అన్నారు. జి.ఎస్.టి కౌన్సిల్ లో ఇప్పటికే ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రం లేవనెత్తిందని, తాను కూడా స్వయంగా ప్రధానికి లేఖ రాసినట్లు సిఎం గుర్తుచేశారు. ఈ రంగాలపై ఆధారపడే వారు తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారని, జి.ఎస్.టి వల్ల వీరికి ప్రతికూలత ఎదురవుతున్నదని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు.