జియో డేటా బేస్‌ హ్యాక్?

రిలయన్స్‌ జియో డేటా బేస్‌ హ్యాకింగ్‌కు గురైందంటూ వచ్చిన వార్తలపై త్వరలోనే టెలికాం శాఖ వివరణ కోరనున్నట్లు సమాచారం. జియో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం తమ వద్ద ఉందంటూ ఓ వెబ్‌సైట్‌ ప్రచురించటం కలకలం సృష్టించింది. దీన్ని జియో ఖండించింది. నిర్ధారణ చేసుకోకుండా నిరాధార ఆరోపణలు సరికాదని హితవు పలికింది. దీనిపై విచారణ చేపట్టాలని లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను సైతం జియో ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా టెలికాం శాఖ జియోను కోరనుందట. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను జియో నుంచి కోరనున్నట్లు టెలికాంశాఖ కార్యదర్శి అరుణ్‌ సుందరరాజన్‌ తెలిపారు. ఆ తర్వాతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.