చైనా ల‌క్ష్యంగా భారత్ మిస్సైల్‌!

చైనా ల‌క్ష్యంగా భారత్ త‌న మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ఠం చేస్తున్న‌ద‌ని అమెరికా అణు నిపుణులు వెల్ల‌డించారు. ఇన్నాళ్లూ పాకిస్థాన్ మాత్ర‌మే భార‌త్ ల‌క్ష్యంగా ఉండేద‌ని, ఇప్పుడు చైనా మొత్తాన్ని క‌వ‌ర్ చేసేలా మిస్సైళ్ల‌ను త‌యారు చేసే ప‌నిలో భార‌త్ ఉంద‌ని చెప్పారు. ద‌క్షిణ భార‌తదేశంలోని బేసెస్ నుంచి ప్ర‌యోగిస్తే.. చైనా మొత్తం లక్ష్యంగా చేసుకొనే మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను భార‌త్ అభివృద్ధి చేస్తున్న‌ద‌ని ఆఫ్ట‌ర్ మిడ్‌నైట్ అనే డిజిట‌ల్ జ‌ర్న‌ల్‌ ఓ ఆర్టిక‌ల్ ప్రచురించింది. ఇండియ‌న్ న్యూక్లియ‌ర్ ఫోర్సెస్ 2017 పేరుతో ఈ ఆర్టిక‌ల్‌ను రాశారు హ‌న్స్ క్రిస్ట‌న్‌సేన్‌, రాబ‌ర్ట్ నోరిస్ అనే అణు నిపుణులు. ఇండియా 150 నుంచి 200 వ‌ర‌కు న్యూక్లియ‌ర్ వార్‌హెడ్స్‌ను త‌యారు చేయ‌గ‌లిగే ప్లుటోనియంను స‌మ‌కూర్చుకోగ‌లిగింద‌ని, అయితే ఇప్ప‌టివ‌ర‌కు 120-130 మాత్ర‌మే త‌యారు చేసింద‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం చైనా ల‌క్ష్యంగానే కొత్త మిస్సైల్స్‌ను భార‌త్ త‌యారుచేస్తున్న‌ద‌ని స్ప‌ష్టంచేశారు. వ‌చ్చే ప‌దేళ్ల‌లో ఆ దిశ‌గానే కొత్త టెక్నాల‌జీల‌ను, వ్య‌వ‌స్థ‌ల‌ను భార‌త్ స‌మ‌కూర్చుకోనుంద‌ని ఆ ఇద్ద‌రు నిపుణులు చెప్పారు. ప్ర‌స్తుతం అణు సామ‌ర్థ్యం ఉన్న ఏడు వ్య‌వ‌స్థ‌లు భార‌త్ ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు వాళ్లు తెలిపారు. రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నాలుగు ఉప‌రిత‌ల బాలిస్టిక్ మిస్సైల్స్‌, స‌ముద్రంపై నుంచి ప్ర‌యోగించ‌గ‌లిగే బాలిస్టిక్ మిస్సైల్ భార‌త్ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని ఆ ఆర్టిక‌ల్‌లో రాశారు. ఇంకా నాలుగు వ్య‌వ‌స్థ‌లను భార‌త్ అభివృద్ధి చేస్తున్న‌ద‌ని, ఇవ‌న్నీ లాంగ్ రేంజ్ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌లేన‌ని ఆ నిపుణులు స్ప‌ష్టంచేశారు. 600 కేజీల ప్లుటోనియం భార‌త్ ద‌గ్గ‌ర ఉన్నా.. ఆ మొత్తాన్నీ కేవ‌లం న్యూక్లియ‌ర్ వార్‌హెడ్స్ త‌యారీకి మాత్ర‌మే వాడ‌లేద‌ని చెప్పారు. అగ్ని 4 మిస్సైల్‌తో చైనాలోని ఈశాన్య ప్రాంతం మొత్తం క‌వ‌ర్ అవుతుంద‌ని, ఇప్పుడు త‌యార‌వుతున్న అగ్ని 5 మిస్సైల్ మొత్తం చైనాను క‌వ‌ర్ చేస్తుంద‌ని రాబ‌ర్ట్‌, క్రిస్ట‌న్‌సేన్ వెల్లడించారు.