చైనా బెదిరింపులకు భయపడేదిలేదు

సరిహద్దు సమస్యపై చైనా ఏమాత్రం వెనుకకు తగ్గడం లేదు. రాజీ ప్రసక్తే లేదని, బంతి భారత్ కోర్టులో ఉన్నదని తేల్చి చెప్తున్నది. భారత్ తన సైన్యాన్ని వెనుకకు తీసుకుంటే తప్ప చర్చలకు తావు లేదని స్పష్టం చేస్తున్నది. ఇలా సరిహద్దు సమస్యలు ఏర్పడినప్పుడు వివిధ స్థాయిల్లో చర్చలు జరుపాలని, ఫ్లాగ్ మీటింగుల ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనాలని భారత్, చైనా 2012లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో 19 సార్లు చర్చలు జరిగాయి.

ఇక  గత మూడు వారాలుగా రెండు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నా పరిష్కారం చూపే దిశగా అడుగులు పడటం లేదు. ఈశాన్య రాష్ర్టాలను భారత్‌లోని మిగతా భూభాగానికి కలిపే కీలక ప్రాంతమైన ట్రైజంక్షన్ వరకు రోడ్డు నిర్మించాలని చైనా ప్రయత్నించింది.  చైనా రోడ్డు నిర్మాణం పూర్తయితే సైనికపరంగా ఆ దేశానికి ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. అయితే రక్షణ పరంగా, పాలనాపరంగా భారత్‌కు ఎన్నో సమస్యలు ఏర్పడుతాయి. ఈ నేపథ్యంలో చైనా తన ప్రతిపాదనను వెనక్కి తీసుకునేవరకు పరిస్థితిలో మార్పు ఉండదని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు తాజా ఉద్రిక్తతలపై చర్చించేందుకు భూటాన్, చైనా సిద్ధమయ్యాయి.

డోక్లామ్ లోనే భద్రతా దళాలలను ఉంచాలని భారత్ నిర్ణయించింది.  సైన్యానికి అవసరమైన సామగ్రిని పంపేందుకు ఆర్మీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. డోంగ్లాంగ్ తమ ప్రాంతమని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని తాము పదే పదే హెచ్చరిస్తున్నా, భారత్ ససేమిరా అంటుండటం చైనాకు మింగుడుపడడంలేదు. పైగా అక్కడ టెంట్లు వేసుకుని సుదీర్ఘంగా ఇక్కడే ఉంటామన్న సంకేతాలు ఇవ్వడంతో డ్రాగన్ దేశం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నది. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నాలుగోవారానికి చేరింది. డోక్లాంలో రక్షణ పరంగా స్థిరంగా నిలబడిన భారత్, దౌత్యపరంగా మిత్రదేశాలన్నింటినీ ఏకం చేస్తున్నది.  ఇక దేశీయంగా రూపొందించిన తుపాకులను ఆర్మీ తిరస్కరించిన నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాల కొనుగోలు ప్రక్రియను కేంద్రప్రభుత్వం వేగవంతం చేసింది. కాలంచెల్లిన ఇన్సాస్ తుపాకుల స్థానంలో 1.85లక్షల హైకాలిబర్ తుపాకుల కొనుగోలుకు సిద్ధమైంది. సరిహద్దుల్లో అవసరాల కోసం 65వేల అత్యాధునిక తుపాకులు తక్షణమే కావాలన్న ఆర్మీ ఒత్తిడిమేరకు 20 ఆయుధ కంపెనీలతో ప్రభుత్వం చర్చించింది. వీలైనంత వేగంగా ఆయుధాలు దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. భారత ఆర్మీ తీవ్రమైన ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నది. గత నెలలో ఇచాపోర్ ప్రభుత్వ కర్మాగారం నుంచి వచ్చిన తుపాకులను తీసుకునేందుకు సైనికులు విముఖత వ్యక్తంచేశారు. నాణ్యతలేమి, తక్కువ పేలుడుసామర్థ్యం ఉన్న ఆ తుపాకులు తమ అవసరాలు తీర్చలేవని ఆర్మీ కూడా పేర్కొన్నది . బరువు తక్కువగా ఉండి 500 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఆధునిక తుపాకులు అవసరమని స్పష్టంచేసింది. దీంతో ప్రభుత్వం అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు సిద్ధమైంది.