ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు విశ్వాసం పెరిగింది

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్లు 35 శాతం పెరిగారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్ సి లక్ష్మారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న వైద్యం వల్ల ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల భవనంలో డాక్టర్స్ డే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆత్మీయ అతిథిగా టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు పాల్గొన్నారు.

మరోవైపు, పేద ప్రజల కోసం గాంధీ ఆసుపత్రిలో అత్యాధునికమైన ఐసీయూను ఏర్పాటు చేశామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. 165 పడకలతో అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐసీయూను తొందర్లోనే ప్రారంభిస్తామన్నారు. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ ను తలదన్నేలా ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలను కల్పిస్తున్నామని లక్ష్మారెడ్డి వెల్లడించారు.