గణతంత్ర వేడుకలకు 10 దేశాల అధినేతలు

వచ్చే ఏడాది జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవాలకు ఆగ్నేయాసియా దేశాధినేతలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సహజంగా ప్రతిసారి ఒక దేశాధినేతను మాత్రమే అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీ. కానీ 2018లో నిర్వహించే ఈ వేడుకలకు ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల కూటమి)కి చెందిన 10 దేశాల అధినేతలను ఆహ్వానించాలనుకోవడం ఇదే మొదటిసారి. ఈ పది దేశాల్లో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలతో మైత్రిని పెంపొందించుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందులో భాగంగా ఆగ్నేయాసియా దేశాలతో సత్సంబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నది. దక్షిణ చైనా సముద్ర జలాల విషయంలో చైనాకు ఆగ్నేయాసియా దేశాలకు మధ్య వివాదాలు కొనసాగుతుండటం, సరిహద్దు సమస్యలు ఎదురవుతుండటం, ఇటీవల భారత్‌తో కూడా చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆగ్నేయాసియా దేశాలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించనుండటం విశేషం.