కోదండరాం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు

మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రజలకు కోదండరాం క్షమాపణ చెప్పాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేసినా గుడ్డిగా వ్యతిరేకించడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని, కోదండరాం కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తున్నారని కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాదిరిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నార్లాపూర్ నుంచి డిండికి ఫ్లోరైడ్ బాధిత దేవరకొండ, మునుగోడుకు నీళ్లు తీసుకుపోవద్దని కోదండరాం చెప్పటం అమానీయం అని ప్రభాకర్ అన్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల మధ్య విద్వేషాలు రేచగట్టేందుకు కోదండరాం చూస్తున్నారని విమర్శించారు.

శ్రీశైలం నుంచి సగం నీటి వాటా కోసం పోరాడుతామని, సాధిస్తామని కర్నె ప్రభాకర్ దీమా వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు 80 టీఎంసీల నీరు తరలించుకునే కుట్ర చేస్తే కోదండరాం ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ తో అంటకాగి ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నవే కోదండరామ్ మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ పెంచుకున్న చిలుకలా కోదండరాం మాట్లాడుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం కోసమే నార్లపూర్ నుంచి నల్లగొండ జిల్లాకు నీళ్ళు తీసుకొస్తున్నారని తెలిపారు. కోదండరామ్ ను కాంగ్రెస్ నేతలు ఆడిస్తున్నారని ఆరోపించారు. పిచ్చి ముదిరిన వ్యక్తిలా కోదండరాం మాట్లాడుతున్నారని, ఇలాగే వ్యవహరిస్తే ఆయన్ని ప్రజలు రాక్షసుడిగా గుర్తిస్తారని అన్నారు.