కోచ్‌గా శాస్త్రికి సీవోఏ ఆమోదం

టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి నియామకాన్ని బీసీసీఐ పాలకుల కమిటీ (సీవోఏ) ఆమోదిం చింది. కానీ విదేశీ టూర్లకు బ్యాటింగ్‌, బౌలింగ్‌ సలహాదారు లుగా రాహుల్‌ ద్రావిడ్‌, జహీర్‌ ఖాన్‌ అపాయింట్‌మెంట్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. శాస్త్రితో చర్చించిన తర్వాత సహాయ సిబ్బంది నియామకం చేపట్టనున్నట్టు సీవోఏ తెలిపింది. ఈ సమావేశంలో సీవోఏ సభ్యులు వినోద్‌ రాయ్‌, డయానా ఎడుల్జీ, బోర్డు సీఈవో రాహుల్‌ జోహ్రీలు కోచ్‌ నియామకంపై ఆమోదముద్ర వేశారు. అయితే బోర్డు ప్రకటించిన విధంగా ద్రావిడ్‌, జహీర్‌ ఖాన్‌లపై ఎటువంటి స్పష్టతనివ్వలేదు. దీంతో శ్రీలంక పర్యటనకు వీరు వెళ్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అటు రవిశాస్త్రి పారితోషికంతో పాటు సహాయ సిబ్బంది నియామకం కోసం బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, సీఈవో రాహుల్‌ జోహ్రీ, ఎడుల్జీతో నలుగురు సభ్యుల కమిటీని సీవోఏ ఏర్పాటు చేసింది. బుధవారం సమావేశం కానున్న కమిటీ.. తమ సిఫారసులను 22న సీవోఏకు అందజేయనుంది.