కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టం

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు అన్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటోందని నిప్పులు చెరిగారు. ఐతే, సీఎం కేసీఆర్ ముందు హస్తం ఆటలు సాగవని తేల్చిచెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్వీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి నాయకులకు మార్గనిర్దేశం చేశారు.

భవిష్యత్ తరాలకు నాయకత్వం వహించేది విద్యార్థులే అన్నారు మంత్రి కేటీఆర్. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్వీ సైన్యంలా పని చేసిందని ప్రశంసించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ ఇదే నిబద్దతతో పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ సముచిత గౌరవం ఇస్తారని భరోసా ఇచ్చారు. దేశంలోనే అతి తక్కువ వయస్సున్న తెలంగాణ రాష్ట్రం.. కేసీఆర్ పాలనలో అద్భుతంగా అభివృద్ధి చెందుతోందన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమన్నారు.

ఉమ్మడి పాలనలో విద్య నిర్లక్ష్యానికి గురైందన్నారు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్. సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నారని చెప్పారు. ఇందుకోసం భారీగా నిధులు కేటాయిస్తున్నరని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ విద్యార్థులు ఉద్యమం నాటి స్ఫూర్తితో పనిచేయాలని సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. టీఆర్ఎస్వీలో చేరడం ఒక గౌరవంగా భావించాలన్నారు.

టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం తర్వాత టీఆర్ఎస్వీ నాయకులు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.