కేజీబీవీల్లో ఉత్తమ సౌకర్యాలు

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)తనకు ఇష్టమైన విద్యాసంస్థలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కేంద్రమంత్రి కూడా రాష్ట్రంలోని కేజీబీవీలను మెచ్చుకున్నారని చెప్పారు. హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో 397 కేజీబీవీలు పనిచేస్తున్నాయని కడియం శ్రీహరి తెలిపారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో విద్యపరంగా వెనుకబడిన మండలాలను గుర్తించామని, వాటిలో 84 కేజీబీవీలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు. వీటిలో పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నారని, వారికి అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.

గతంలో స్కూళ్లలో ఫర్నిచర్, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్ ఉండేవి కావని, తాను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత స్కూల్స్ లో సమస్యలను తీర్చామన్నారు కడియం. ఐతే, ఇంకా కొన్ని పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. 391 కేజీబీవీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 525 గురుకుల, 84 కేజీబీవీ, 24 అర్బన్ స్కూల్స్ ప్రారంభించామని, ఇందులో కొన్ని అద్దె భవనాలలో నడిపిస్తున్నామని కడియం తెలిపారు.  జిల్లాల వారీగా కేజీబీవీలను కాంట్రాక్టర్ కు ఇచ్చే అంశాన్ని చర్చిస్తున్నామని వెల్లడించారు.

కొత్తగా మంజూరైన 84 కేజీబీవీలకు నిధులు మంజూరు చేశామని కడియం వెల్లడించారు. కేజీబీవీల్లో 6,7,8 తరగతులు చదివే విద్యార్థులకు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తోందని,  9,10 తరగతుల వారికి రాష్ట్ర బడ్జెట్ నిధుల నుంచి ఖర్చు చేస్తున్నామని వివరించారు. కేజీబీవీల్లో పనిచేసే టీచర్లకు జీతాలు పెంచే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. మండలానికి ఒక గురుకుల పాఠశాల ఉండాలని మంత్రులు సీఎం కేసీఆర్ ని కోరారని, సీఎం ఆదేశం మేరకు వాటి వివరాలు రూపొందిస్తున్నామని చెప్పారు.

గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెంచడంతో ప్రైవేట్ స్కూల్స్ లో ఎన్ రోల్ మెంట్ తగ్గిందని పలు కార్పొరేట్ స్కూల్స్ ప్రతినిధులు నిన్న తనను కలిసి చెప్పారని కడియం వెల్లడించారు.