కేంద్రమంత్రి సుష్మా సంతకం ఫోర్జరీ

వైష్ణో దేవి ఆలయ సందర్శన కోసం హెలికాప్టర్‌ టికెట్లను పొందేందుకు ఏకంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేశాడు. వాటిని బ్లాక్‌ లో అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. జమ్ముకశ్మీర్‌లోని రేసి జిల్లాకు చెందిన సందీప్‌ అనే వ్యక్తి ఈ ఫోర్జరీకి పాల్నడ్డాడు. వైష్ణోదేవి మాత ఆలయానికి వెళ్లేందుకు గాను ఉండే కోటా టికెట్లను దక్కించుకునేందుకు గానూ ఈ పథకం వేశాడు. సుష్మాస్వరాజ్‌ సంతకంతో ఉన్న లెటర్‌ హెడ్లతో టికెట్లు సంపాదించాడు. వాటిని అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు.   నిందితుడిపై కత్రా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.