కివీస్‌పై ఘన విజయం, సెమీస్‌కి భారత్

మహిళా క్రికెట్‌ ప్రపంచకప్‌లో మిథాలీ సేన ధర్జాగా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ లో, ఆ తర్వాత బౌలింగ్‌ లో చెలరేగిన భారత్‌.. న్యూజిలాండ్‌ పై 186 పరుగులతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్  మిథాలీ రాజ్‌ సూపర్‌ సెంచరీకి తోడు  వేద కృష్ణమూర్తి, హర్మన్ ప్రీత్ కౌర్ వాల్యుబుల్ ఇన్నింగ్స్ తో భారత్ న్యూజిలాండ్‌  ముందు 266 పరుగుల భారీ టార్గెట్‌ ఉంచింది. లక్ష్యఛేదనలో కివీస్ ను స్పిన్నర్ రాజేశ్వరీ గైక్వాడ్ కోలుకోలేని దెబ్బకొట్టింది. కెరీర్ లో తొలిసారి ఐదు వికెట్లు తీసింది. దీప్తి శర్మకు రెండు, పూనమ్‌ యాదవ్, గోస్వామి, శిఖా పాండే తలో వికెట్ తీశారు.

266 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభం నుంచే తడబడింది. కెప్టెన్ బేట్స్ తో పాటు ప్రధాన ప్లేయర్లంతా తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యారు. టాపార్డర్ లో సాథర్ వైట్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. కివీస్ ప్లేయర్లలో కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే డబుల్ డిజిట్ చేశారు. 7.3 ఓవర్లు మాత్రమే వేసిన గైక్వాడ్ ఓ మేడిన్ తో పాటు  కేవలం 15 పరుగులే ఇచ్చి ఐదు కీలక వికెట్లు తీసింది. దీంతో కివీస్ 25.3 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. 186 పరుగుల తేడాతో భారత్ జయకేతనం ఎగురవేసింది.

అంతకు ముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ మిథాలీ, హర్మన్ ప్రీత్ కౌర్ లు అద్భుత బ్యాటింగ్ తో అలరించారు. మూడో వికెట్ కు 132 పరుగుల భారీ పార్టనర్ షిప్ నమోదు చేసింది. 60 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్ కీలక సమయంలో వెనుదిరిగినా.. మిథాలీ శతకంతో బ్యాటింగ్ భారాన్ని  మోసింది. చివర్లో వేద కృష్ణమూర్తి సుడిగాలి ఇన్నింగ్స్ తో అలరించింది. కేవలం 45 బంతుల్లో 2 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 70 పరుగులు చేసింది. మిథాలి 123 బంతుల్లో 11 ఫోర్లతో 109 రన్స్ చేసింది. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో కాస్ర్పెక్ కు మూడు, రోవ్ రెండు వికెట్లు తీశారు.

మిరాకిల్ సెంచరీతో మెరిసిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.. ఇక  ఈ నెల 20న డెర్బీ వేదికగానే జరిగే  రెండో సెమీస్ లో భారత్ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పోటీపడనుంది.