కాళేశ్వరం ప్రాజెక్టుకు సిగ్నల్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు.. క్లియరెన్స్‌ లభించింది. అటవీ అనుమతులను మంజూరు చేయాల్సిందిగా.. కేంద్ర అటవీ – పర్యావరణ మంత్రిత్వశాఖ శాఖకు.. అటవీ సలహా కమిటీ  సిఫారసు చేసింది. గత నెల 15న భేటీ అయిన ఈ కమిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న  ఎనిమిది ఫారెస్టు డివిజన్లకు చెందిన 3వేల168.131  హెక్టార్ల అటవీ భూములను వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిపై చర్చించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సాగు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ కే జోషి, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరిరాం హాజరై  కమిటీ సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. అటవీ సలహా కమిటీకి కేంద్ర అటవీ విభాగం డైరెక్టర్ జనరల్ సిద్ధాంత్‌దాస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు ఇవ్వాలని కమిటీ అధికారికంగా మినిట్స్‌ లో స్పష్టం చేసింది. కమిటీలోని సభ్యులు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్లను అధ్యయనం చేసి తమ సమ్మతిని తెలిపారు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉన్నందున.. అక్కడి తాజా వివరాలను కమిటీకి సమర్పించాలని ఎఫ్‌ఏసీ సభ్యులు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాలువలకు, బ్యారేజీలకు 3,168.131  హెక్టార్ల అటవీ భూములను వాడుకోవచ్చునని,  దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సూచించిన ప్రాంతాల్లో  3,367.139  హెక్టార్ల మేర మొక్కలు నాటి అడవులను పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం 3,367.139  హెక్టార్ల మేర ప్రత్యామ్నాయ అడవులను పెంచడానికి వివరాలు సమర్పించగా,  అందులో 682.296 హెక్టార్లలో మొక్కలు నాటడానికి సరైన పరిస్థితులు లేనందున ఇతర ప్రాంతాలను ప్రతిపాదించి కమిటీకి సమర్పించాలని ఆ మినిట్స్‌ లో  పేర్కొన్నది.

రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల 25వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం జయశంకర్ భూపాలపల్లి,  రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్,  నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల పరిధిలోని అటవీ భూములను వినియోగించుకుంటామని ప్రభుత్వం కోరింది.