కాజల్ ఆ లిస్టులో చేరబోతుంది!

గత కొంత కాలంగా దక్షిణాదిలో మహిళా ప్రధాన ఇతివృత్తాలతో తెరకెక్కిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చక్కటి వసూళ్లను సాధిస్తున్నాయి. ఈ తరహా సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోయిన్‌లు సైతం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మహిళా ప్రధాన కథాంశాలతో నయనతార, అనుష్క స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకోవడంతో వీరి బాటలో పలువురు నాయికలు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ జాబితాలో కాజల్ అగర్వాల్ చేరుతున్నట్లు తెలిసింది. కెరీర్ ఆరంభం నుంచి ప్రయోగాలకు దూరంగా ఉంటూ గ్లామర్ పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న ఆమె ప్రస్తుతం తన పంథాను మార్చుకునే పనిలో పడింది. పి.వాసు దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి కాజల్ అగర్వాల్ అంగీకారం తెలిపింది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర భిన్న పార్శాల్లో డీ గ్లామర్ లుక్‌తో కనిపించనుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.