కరీంనగర్ లో ఒకేరోజు లక్ష మొక్కలు

కరీంనగర్ లో ఒకేరోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు ఈటెల రాజేందర్, జోగు రామన్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మూడవ విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 12న కరీంనగర్ లో ప్రారంభించనున్నారు. అదే రోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రులు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష జరిపారు.

అధికారులు పక్కా ప్రణాళికతో హరితహారం విజయవంతం చేయాలని మంత్రి జోగు రామన్న కోరారు. స్కూళ్లలో మొక్కలు నాటడం, సంరక్షించడాన్ని డీఈవో పర్యవేక్షించాలని చెప్పారు. రోడ్ల వెడల్పునకు అవకాశం ఉన్నచోట మొక్కలు నాటొద్దని, ఎంపీడీవోలు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీలను వాడుకుంటే మొక్కకు రూ.5 చెల్లిస్తామని తెలిపారు. సర్పంచ్ అధ్యక్షతన గ్రామ హరిత రక్షణ కమిటీలు ఏర్పాటు చేసి, హ్యామ్లెట్ గ్రామాల్లో మొక్కల రక్షణ బాధ్యతను హరిత రక్షణ కమిటీ సభ్యులకు కేటాయించాలని అధికారులను మంత్రి కోరారు.

ఎన్ని మొక్కలు నాటినమన్నది ముఖ్యం కాదని, ఎన్ని బతికించామన్నదే ముఖ్యమని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రహదారుల వెంట నాటే మొక్కల సంరక్షణ కోసం ఖర్చు ఎక్కువైనా వెనకాడకుండా ఖచ్చితంగా ఫెన్సింగ్ వేయాలని చెప్పారు. ఫోటోలకు పోజుల కోసం కాకుండా పక్కా ప్రొఫెషనల్ గా మొక్కలు నాటాలని మంత్రి ఈటెల స్పష్టం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం హరితహారాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కోరారు. ప్రజాప్రతినిధుల కంటే అధికారులే మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. స్మశానవాటికల్లో ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు. కరెంట్ తీగల కింద పరిమిత ఎత్తు వరకు పెరిగే మొక్కలనే నాటాలన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే సతీష్, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, జిల్లా కలెక్టర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.