ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారు!

తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది కాజల్‌ అగర్వాల్‌. అయితే తాజాగా ఈమె మీద కొన్ని గ్యాసిప్‌లు ప్రచారంలోకి వచ్చాయి. ఓ తెలుగు స్టార్‌ హీరోతో ప్రేమలో ఉందని, అతణ్ని రహస్యంగా కలుస్తోందని వార్తలు వచ్చాయి. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడిన కాజల్‌.. తను ప్రేమ వివాహమే చేసుకుంటానని, తనకు కాబోయే వాడు సినీరంగానికి చెందినవాడైనా ఫర్వాలేదని, అతను అందంగా ఉన్నా లేకపోయినా, ఆరడుగుల పొడవు ఉండాలని చెప్పింది. దీంతో ఓ టాలీవుడ్‌ స్టార్‌ హీరోతో కాజల్‌ ప్రేమలో ఉందని గ్యాసిప్‌లు పుట్టుకొచ్చాయి. అటు అవకాశాల కోసం తాజాగా తన ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కాజల్‌  ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇటీవలి కాలంలో నాపై వస్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తున్నాయి. నా ఎదుగుదలను చూసి ఓర్వలేని వారే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా వారు నాపై పన్నుతున్న కుట్ర. అయినా నేను వెనక్కి తగ్గను. తెలుగు,తమిళ అగ్రహీరోల సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నన్నేం చేయలేరు’అని చెప్పింది కాజల్‌.