ఏ కష్టం వచ్చినా నా సెల్ ఫోన్‌కు మెసేజ్ చేయండి

మీరు కార్య‌క‌ర్త‌లు, మేం నాయ‌కుల‌మ‌నే భేద‌భావాలొద్దు… మ‌న‌మంతా ఒక్క‌టే, మ‌నంద‌రిదీ టిఆర్ఎస్ కుటుంబం అన్నారు నిజామాబాద్ ఎంపి క‌విత‌. బాల్కొండ నియోజ‌క వ‌ర్గం వేల్పూర్ మండ‌లంలో జ‌రిగిన టిఆర్ఎస్ కుటుంబ స‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మానికి ఆమె ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్ర‌శాంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో క‌విత మాట్లాడారు.

కుటుంబంలో ఎవ‌రికి క‌ష్టం వ‌చ్చినా మిగ‌తా వారు స్పందించాలని ఎంపీ కవిత సూచించారు. అలాగే మీకే క‌ష్టం వ‌చ్చినా నా సెల్‌ ఫోన్‌కు మెసేజ్ చేస్తే స్పందిస్తాన‌ని కార్యకర్తల క‌ర‌తాల ధ్వనుల మ‌ధ్య హామీనిచ్చారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్పుడూ తెలంగాణ బాగు కోస‌మే తపన పడుతున్నార‌ని, రాత్రిళ్లు సైతం గులాబి కండువాల గురించే ఆలోచిస్తుంటార‌ని క‌విత తెలిపారు. మంచి మ‌న‌సున్న మ‌న‌ నాయ‌కుడు సిఎం కేసీఆర్ కార్య‌క‌ర్త‌ల‌కు పెద్ద దిక్కు అన్నారు. వేల్పూరు మండ‌లానికి వివిధ అభివృద్ధి ప‌నుల కోసం  131 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారంటే మీ ప‌ట్ల సిఎం కేసీఆర్‌కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తున్న‌ద‌ని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సిఎం కార్యాల‌యం ప్ర‌త్యేకాధికారి దేశ‌ప‌తి శ్రీనివాస్‌, రెడ్‌కాప్ ఛైర్మ‌న్ అబ్దుల్ అలీం, జ‌డ్పీ వైస్ ఛైర్మ‌న్ సుమ‌నారెడ్డి, జ‌డ్పీటిసి విమ‌ల, మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ పుట్ట ల‌లిత‌, టిఆర్ఎస్ మండ‌ల అధ్య‌క్షులు మిట్ట‌ప‌ల్లి మ‌హిపాల్‌, ఎంపిపి ర‌జిత, ఎంపిటిసి లోలం న‌ర్సుబాయి, స‌ర్పంచ్ తిరుమ‌ల శ్రీనివాస్, పెద్దసంఖ్యలో టిఆర్ఎస్ కార్యకర్తలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.