ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్!

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్‌బీఐ.. డిజిటల్ లావాదేవీలకు ఊతమిచ్చేందుకు ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసేవారిపై చార్జీల భారాన్ని భారీగా తగ్గించింది. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో నగదు బదిలీపై వసూలు చేసే చార్జీల్లో 75 శాతం వరకు కోత పెడుతున్నట్లు, ఈ సవరణ శనివారం (ఈనెల 15) నుంచి అమలులోకి రానున్నదని ఎస్‌బీఐ తెలిపింది. చార్జీల తగ్గింపుతో 5.27 కోట్ల మంది కస్టమర్లకు ప్రయోజనం చేకూరనుందని బ్యాంక్  పేర్కొంది. ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకుంటున్నవారికి ఈ చార్జీల తగ్గింపు వర్తిస్తుంది. మార్చి చివరినాటికి ఎస్‌బీఐలో 3.27 కోట్ల మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్, 2 కోట్ల మంది మొబైల్ బ్యాంకింగ్ కస్టమర్లున్నారు.

చార్జీల సవరణ షెడ్యూలు ప్రకారం.. ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా రూ.10 వేల వరకు సొమ్ము బదిలీ చేస్తే చార్జీ ఇప్పుడున్న రూ.2 నుంచి రూపాయికి తగ్గనుంది. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు చార్జీని రూ.4 నుంచి రూ.2కు తగ్గించారు. ఇక రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు సొమ్ము బదిలీపై చార్జీని ప్రస్తుతమున్న రూ.12 నుంచి రూ.3కు తగ్గించారు. రూ.2 లక్షలకు పైగా నగదు బదిలీపై చార్జీని ఇప్పుడున్న రూ.20 నుంచి రూ.5కు తగ్గించారు.  రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) ద్వారా ఆన్‌లైన్‌లో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సొమ్ము బదిలీపై చార్జీని ప్రస్తుతమున్న రూ.20 నుంచి రూ.5కు తగ్గించారు. రూ.5 లక్షల కంటే అధికమొత్తంలో ట్రాన్స్‌ఫర్ చేసేందుకు చార్జీని రూ.40 నుంచి రూ.10కి తగ్గించారు. బ్యాంక్ బ్రాంచీల్లోని ఎగ్జిక్యూటివ్‌ల ద్వారా నగదు బదిలీ చేస్తే ఇందుకు భిన్న చార్జీలు వర్తిస్తాయి. కొత్తగా సవరించిన చార్జీలపై 18 శాతం జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.