ఎరువులపై పన్ను రేటు తగ్గింపు

జీఎస్టీతో ఆందోళనకు గురౌతున్న రైతన్నకు కేంద్రం తీపి కబురు అందించింది. ఎరువులపై విధించిన 12 శాతం పన్నును 5 శాతానికి తగ్గించింది. అధిక పన్నుతో ఎరువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అటు ట్రాక్టరు విడిభాగాలపై నిర్ణయించిన పన్నును 28శాతం నుంచి 18శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియలో భాగస్వాములైన వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపేందుకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం ఎరువులపై వివిధ రాష్ట్రాల్లో సున్నా నుంచి ఆరు శాతం వరకు పన్నులున్నాయి. వీటిపై తొలుత నిర్ణయించినట్టుగా 12 శాతం జీఎస్టీ విధిస్తే పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో యూరియా, డయామోనియం ఫాస్పేట్, పొటాష్‌ పై బస్తాకు రూ.80 నుంచి రూ.120 వరకూ ధరలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గించాలని ఎరువుల పరిశ్రమ నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు రావడంతో జీఎస్టీ కౌన్సిల్ సానుకూలంగా స్పందించింది.