ఎన్‌ఐఏతో విచారణ జరిపించండి

ఉత్తరప్రదేశ్ శాసనసభలో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం పెంటాఎరిథ్రిటోల్ టెట్రానైట్రేట్(పీఈటీఎన్) దొరికింది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో స్పందించారు. పేలుడు పదార్థం లభ్యంపై ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని స్పీకర్ ని కోరారు. సభలో ప్రతిపక్ష నేత రామ్ గోవింద్ సీటు కింద 150 గ్రాముల పీఈటీఎన్(పేలుడు పదార్థం) లభ్యం కావడం విచారకరమన్నారు. 500 గ్రాముల పీఈటీఎన్‌కు అసెంబ్లీ భవనాన్ని పేల్చే సామర్థ్యం ఉంటుందన్నారు. పేలుడు పదార్థాన్ని సభలోకి ఎవరూ తీసుకువచ్చారనే విషయంపై ప్రతీ సభ్యుడిని, సిబ్బందిని పోలీసులు, ఎన్‌ఐఏ విచారించాలని సూచించారు. ఉగ్రవాదుల కుట్రల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ స్థాయిలో భద్రతను పెంచుతున్నట్లు ప్రకటించారు. భద్రతా సిబ్బంది సూచనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని ఆదేశించారు సీఎం. పేలుడు పదార్థాన్ని సభలోకి ఎవరూ తీసుకువచ్చారనేది విచారణలో తేలిన తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యోగి స్పష్టం చేశారు.