ఎన్డీఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు

ఎన్డీఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న సస్పెన్స్‌ కు తెరపడింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది.  ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు గంటన్నరపాటు చర్చించిన నేతలు.. ఎన్డీఎ పక్షాలతోనూ చర్చించారు. చివరికి వెంకయ్యను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడి, కేంద్రమంత్రులు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వెంకయ్యనాయుడుని అభినందించారు. సమావేశం తర్వాత అమిత్ షా మీడియాకు వివరాలు వెల్లడించారు.

వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి అన్నివిధాల అర్హుడని అమిత్ షా అన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. వెంకయ్య విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు బీజేపీ విధానాలకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. రేపు ఉదయం 11 గంటలకు ఉప రాష్ట్రపతి పదవికి ఆయన నామినేషన్ వేస్తారని ప్రకటించారు. ప్రతిపక్షాలు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ఉన్నందువల్ల ఏకగ్రీవ ఎన్నిక ప్రశ్నే ఉండదన్నారు.