ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు బీజేపీపీ బోర్డ్ భేటి

బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాలయంలో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరి, అనంతకుమార్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. రాజ్యసభలో విపక్షాలను ఎదుర్కొవాలంటే వెంకయ్యనాయుడు ద్వారానే సాధ్యమవుతుందన్న భావనను ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వెంకయ్య పేరు ఖరారైతే ఈ రాత్రికి కేంద్రమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్డీఎ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు.

మరోవైపు, 10 జనపథ్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశమయ్యింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఆ పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని ప్రకటించారు. రేపు ఉదయం ఆయన నామినేషన్ కు సంబంధించిన అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.