ఉద్యమ స్ఫూర్తితో సాగుతున్న హరితహారం

రాష్ట్రవ్యాప్తంగా హరితహారం విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి జోగు రామన్న చెప్పారు. రాష్ట్రంలో మూడో విడత కింద ఇప్పటివరకు 4 కోట్ల 75 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్, పూసాయి, పిప్పల్ వాడ తదితర గ్రామాల్లో హరితహరంలో మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే ఇప్పటివరకు 15 లక్షల మొక్కలు నాటామని ఆయన తెలిపారు. ప్రతి రోజు కోటి మొక్కలు నాటడమే లక్ష్యమన్న జోగు రామన్న.. హరితహరంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలని కోరారు.

మంచిర్యాల జిల్లాలో హరితహారం జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రంలోని సున్నం బట్టి వాడలో గడపగడపకూ హరితరథాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. హరితహారం కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాను ముందుంచడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ, మున్సిపల్ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అటు హరితహారంలో మంచిర్యాల జిల్లా పోలీసులు కూడా భాగస్వాములు అవుతున్నారు. గఢ్ పూర్, నాగారం గ్రామాల్లో పోలీసులు గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ కోసం ట్రీ గార్డులు కూడా అందిస్తామన్నారు.

వరంగల్ జిల్లాలో హరితహారం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 47వ డివిజన్ లో కార్పొరేటర్ నల్ల స్వరూపరాణి రెడ్డి హరితహారంలో పాల్గొన్నారు. కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. కాలనీ వాసులకు రకరకాల మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని కార్పొరేటర్ స్వరూపరాణి కోరారు.

ఖమ్మం జిల్లాలో హరితహారం విజయవంతంగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చిన్న బీరవెల్లి గ్రామంలో టీ న్యూస్ నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్థానిక టీఆర్ఎస్ నేతలు జోరు వర్షంలోనూ మొక్కలు నాటారు. మధిర నియోజకవర్గంలో 20 లక్షల మొక్కలు నాటుతామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు.

నల్లగొండ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు హరితహారంలో భాగస్వాములు అవుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని సురధాస్ భవన్ బ్లైండ్ స్కూల్లో టీ న్యూస్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంధ విద్యార్థులు పెద్దెత్తున మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రాన్ని పచ్చగా మార్చేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో యావత్ ప్రజానీకం పాలుపంచుకోవాలని అంధ విద్యార్థులు కోరారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి శ్రీకృష్ణ కాలనీలో కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, డీఎస్పీ రమాకాంతరావు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని జైపాల్ యాదవ్ చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో  పోలీసులు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో డీసీపీ యాదగిరి మొక్కలు నాటారు. పోలీసు శాఖ తరఫున యాదాద్రి జిల్లాలో 1 లక్ష 70 వేల మొక్కలు నాటుతామని డీసీపీ తెలిపారు. ఒక్కో పోలీస్ స్టేషన్‌కు 10 వేల మొక్కలు నాటాలని సిబ్బందిని ఆదేశించారు.

మహబూబ్ నగర్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ధర్మాపూర్ గ్రామంలో హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉపాధి మండలి డైరెక్టర్ కోట్ల కిషోర్ రెడ్డి, రూరల్ ఎస్సై గడ్డం కాశీతోపాటు టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి హరితహారంపై అవగాహన కల్పించారు.

నల్లగొండ జిల్లా డిండి మండలం కామెపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ హరితహారంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కోరారు.

వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వేద పాఠశాలలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు మామిడి మెుక్కలను నాటారు. తెలంగాణను ఆకుపచ్చగా మార్చాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని సీపీ సుధీర్ బాబు అన్నారు. హరితహారంలో పోలీసు సిబ్బంది చురుగ్గా పాల్గొనాలని కోరారు.