ఉత్తమ్ పచ్చి అబద్ధాలకోరు

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్దాలకోరని మండిపడ్డారు. పులిచింతల హైడల్‌ ప్రాజెక్టుపై ఆయన చేస్తున్నవన్నీ చౌకబారు ఆరోపణలేనని కొట్టిపారేశారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ 2006లో తయారైతే… 2014 వరకు పనులు మొదలుకానీ సంగతి ఉత్తమ్‌ కు తెలియదా? అని కర్నె ప్రశ్నించారు. పులిచింతల ముంపు పరిహారం విషయంలో గుంటూరు జిల్లా రైతులకో న్యాయం… నల్లగొండ జిల్లా రైతులకో న్యాయం అన్నట్టుగా అప్పటి పాలకులు వ్యవహరించారని ఫైరయ్యారు. ఆంధ్రా రైతులకు ఎకరానికి మూడు లక్షలు పరిహారం ఇస్తే, తెలంగాణ రైతులకు ఎకరానికి లక్ష రూపాయలే ఇచ్చారని గుర్తుచేశారు. తన ప్రాంత రైతులకు ఉత్తమ్‌ అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇకనైనా ఉత్తమ్‌ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టిఆర్ఎస్ నాయకులు, పలువురు రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.