ఉగ్రవాదంపై భారత్, ఇజ్రాయెల్ ఉమ్మడిపోరు

పెరుగుతున్న ఉగ్రవాద, పిడివాద బెడదలపై భారత్, ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేశాయి. తమ బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి విస్తరించుకున్నాయి. ఉగ్రవాద ముఠాలకు ఆశ్రయం, నిధులు సమకూర్చేవారిపై కఠినమైన చర్యలకు ఉమ్మడిగా కదులాలని తీర్మానించుకున్నాయి. రెండు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, బెంజమిన్ నెతన్యాహు జెరూసలేంలో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాద సమస్య ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఉమ్మడిపోరుతో పాటుగా వ్యవసాయం, జలసంరక్షణ, అంతరిక్షం తదితర రంగాల్లో సహకార విస్తరణపై అంగీకారం కుదిరింది. సంక్లిష్టమైన భౌగోళిక స్థితిగతుల మధ్య భారత్, ఇజ్రాయెల్ మనుగడ సాగిస్తున్నాయని, ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు ఎదురవుతున్న వ్యూహాత్మక ముప్పుల గురించి రెండు దేశాలకు లోతైన అవగాహన ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉగ్రవాదం వ్యాపింపజేసే హింస, విద్వేషాలకు భారత్ కూడా ఇజ్రాయెల్ తరహాలోనే బలి అవుతున్నదని చెప్పారు. వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఇతోధికంగా సహకరించుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయని వివరించారు. నెతన్యాహు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని నిరోధించడంలో రెండు దేశాలు సహకరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

26/11 ముంబై ఘటనను ఘోరమైన ఉగ్రదాడిగా పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని రెండు దేశాలు తీర్మానించుకున్నాయని విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ చర్చల అనంతరం మీడియా సమావేశంలో చెప్పారు. ఉగ్రవాదులపై, ఉగ్రవాద సంస్థలపై, వారి నెట్‌వర్క్‌లపై, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, సహాయం అందించి నిధులు సమకూర్చేవారిపై లేదా ఆశ్రయం కల్పించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఉభయనేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాద చర్యలను ఏకారణం చేత కూడా సమర్థించడం కుదరదని అందులో స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వీలైనంత త్వరలో ఆచరణలోకి తేవాలని సూచించారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును సతీసమేతంగా భారత్ సందర్శించాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. దీనికి నెతన్యాహు వెంటనే సమ్మతి తెలిపారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ సంగతి వెల్లడించారు. రెండుదేశాలు ఉగ్రవాద పీడనకు గురయ్యాయని అన్నారు. జలసంరక్షణ, వ్యవసాయ సాంకేతికతలో ఇజ్రాయెల్ సాధించిన విజయాలను మోదీ ప్రశంసించారు. ప్రపంచ శాంతి, సుస్థిరతలను కాపాడడంపై చర్చించుకున్నట్టు వెల్లడించారు. మా మార్గాలు వేరైనా ప్రజాస్వామంలో విశ్వాసం అనేది ఉమ్మడి విధానం అని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతికూలతలను జయించడంలో మీ ప్రజలు సాధించిన విజయాలను భారత్ ప్రశంసిస్తున్నది అన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ రెండోరోజు ఇజ్రాయెల్ పర్యటన బిజీబిజీగా గడిచింది. నెతన్యాహుతో సుదీర్ఘ ద్వైపాక్షిక చర్చలు జరుపడంతోపాటుగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్‌తో సమావేశమయ్యారు. ముంబై ఉగ్రదాడుల నుంచి ప్రాణాలతో బైటపడ్డ చిన్నారి మోషేను కలుసుకున్నారు. ప్రధాని నెతన్యాహు అధికార నివాసాన్ని సందర్శించారు.
ప్రధాని నరేంద్రమోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సుదీర్ఘ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇజ్రాయెల్‌లో రెండోరోజు పర్యటనలో భాగంగా ఆయన నెతన్యాహుతో విడిగా సమావేశమై ఏకాంత చర్చలు జరిపారు. అనంతరం ఇరుదేశాల ప్రతినిధివర్గాలతోపాటుగా వారు చర్చలు కొనసాగించారు. చరిత్రాత్మకమైన పర్యటనపై వచ్చిన తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు, రెండు దేశాల సంబంధాల్లో నూతన శకం ఆవిష్కరించడంలో కీలక భూమిక పోషిస్తున్నందుకు నెతన్యాహుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రెవ్లిన్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ఇజ్రాయెలీ ఆధునిక సాంకేతికతను మేకిన్ ఇండియాతో మేళవించడం గురించి వారు చర్చించారు. మేక్ విత్ ఇండియా అనే పదబంధాన్ని రివ్లిన్ భారత్ పర్యటన సందర్భంగా మొదటిసారిగా ఉల్లేఖించారని ప్రధాని మోదీ తెలిపారు. ప్రొటొకాల్‌ను పక్కనపెట్టి స్వాగతం పలికినందుకు రివ్లిన్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రివ్లిన్ మోదీని గొప్ప ప్రపంచ నాయకుల్లో ఒకరిగా ప్రశంసించారు.

ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని నరేంద్రమోదీ బసచేసిన కింగ్‌డేవిడ్ హోటల్‌కు వచ్చారు. సమావేశం మొదలు పెట్టేందుకు ముందు నెతన్యాహు ప్రధాని మోదీని ఓ కిటికీ దగ్గరకు తీసుకువెల్లి జెరూసలేం పాతబస్తీని వేలుతో చూపించారు. యూదు, క్రైస్తవ, ముస్లిం మతాలకు పవిత్రస్థలంగా భావించే టెంపుల్ మౌంట్‌ను చూపుతూ అది పాతబస్తీ.. అది టెంపుల్ మౌంట్.. ఈ చిన్న ప్రదేశమే మా చరిత్రకు పురిటిగడ్డ అని చెప్పారు. ఇజ్రాయెలీ ప్రధాని చెప్పుకుంటూ పోతుంటే ప్రధాని మోదీ విన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో ఉన్న భారత సంతతి ప్రజల్ని ఉద్దేశించి మోదీ నెతన్యాహు ప్రసంగించారు. ఢిల్లీ, ముంబైల నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌కు విమాన సర్వీసులను ప్రారంభించ నున్నట్లు మోదీ ప్రకటించారు.