ఈ ఏడాదిలోనే మెట్రో పరుగులు

హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏడాదిలో ప్రారంభిస్తమని మంత్రి కేటీఆర్ చెప్పారు. మెట్రో స్టేషన్ల నుంచి బస్సు సర్వీసులను అనుసంధానిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు ఇంటర్‌సిటీ బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. చైనా, కొరియా, జపాన్‌ లాంటి దేశాల్లో సంపన్నులు సైతం బస్సుల్లో ప్రయాణించడానికి మోహమాట పడరని కేటీఆర్ అన్నారు. కానీ, ఇక్కడ  ఏదో తప్పదన్నట్లు కొందరు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరముందన్న మంత్రి కేటీఆర్…ఢిల్లీలో ఎంపీలు మెట్రో రైళ్లలో ప్రయాణించడం గొప్ప పరిణామమన్నారు.

అటు ఔటర్ రింగ్‌రోడ్‌పై రెండు లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటుచేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ.. లాజిస్టిక్స్ హబ్, ట్రాన్స్ పోర్టేషన్ రంగాలను అత్యంత ప్రాధాన్యం కలిగినవిగా గుర్తించిందన్నారు. జీఎస్టీనుంచి ఎలక్ట్రిక్ వాహనాలను మినహాయించాలన్నా కేటీఆర్.. ఈ రంగానికి పలు రాయితీలను అందచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు తెలిపారు. బస్సు ప్రయాణికులకు వై ఫై, లగ్జరీ సదుపాయాలను అందజేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వ బస్సులను నడిపిస్తున్నట్టు తెలిపారు.

బేగంపేటలో జరిగిన బస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బస్సు రవాణా రంగంలో మంచి పనితీరు కనబర్చిన వారికి అవార్డులను అందచేశారు.  ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.