ఇవాళ హైదరాబాద్ కు రామ్ నాధ్ కోవింద్

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్‌ రానున్నారు. ఈ మేరకు ఆయనకు ఘనస్వాగతం పలకాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు రామ్‌ నాథ్ కు వెల్ కమ్ చెప్పేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో రామ్‌నాథ్ కోవింద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. కోవింద్ వెంట కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ ఉంటారు. విమానాశ్రయంలో కోవింద్‌కు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్‌ రెడ్డి, ఉప నేత కే కేశవరావు, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరితో పాటు మంత్రులు టీ హరీశ్ రావు, నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్ స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు నెక్లెస్ రోడ్‌ లోని జలవిహార్‌లో కోవింద్ ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుంది. జలవిహార్ వద్ద ఆయనకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా స్వాగతం పలుకనున్నారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులను కోవింద్‌కు పరిచయం చేయనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, టీఆర్‌ఎస్ శాసనసభ్యులు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లను ఆహ్వానించారు.

అంతకుముందు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు టీడీపీ, బీజేపీ ప్రజాప్రతినిధులతో బేగంపేట హరితప్లాజాలో రామ్‌నాథ్ సమావేశమవుతారు. 11 గంటలకు బంజారాహిల్స్‌ లోని పార్క్ హయత్‌ లో వైసీపీ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం 12.15గంటలకు జలవిహార్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమై.. 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడకు పయనమవుతారు. కోవింద్ పాల్గొనే సమావేశానికి తప్పక హాజరు కావాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. ఉదయం 11 గంటల లోపే జలవిహార్  చేరుకోవాలని మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లకు సూచించారు.