ఇందిరా నగర్ స్కూల్ ఆదర్శం

సిద్దిపేట ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అకస్మికంగా సందర్శించారు. హైదరాబాద్ నుంచి హుస్నాబాద్ మీదుగా వరంగల్ వెళ్తూ సిద్దిపేటలో కాసేపు ఆగి పాఠశాలను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ తీరు, పరిసరాల పరిశుభ్రత, చెట్ల సంరక్షణ, మొక్కల పెంపకం పట్ల మంత్రి పాఠశాల సిబ్బందిని అభినందించారు.

కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ నుంచి ప్రశంసలు పొందిన ఇందిరా నగర్ పాఠశాలను పరిశీలించానని, ఈ పాఠశాలలో ప్రత్యేకతలు, కల్పించిన వసతులను ఇతర పాఠశాలల్లో కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన అని కడియం శ్రీహరి చెప్పారు. ప్రజలకు, తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించాలనే ఆశయంతో ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. మంత్రి హరీశ్ రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, హెడ్ మాస్టర్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు ఈ పాఠశాలను కాపాడుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని, ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉన్న పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధిస్తాయనడానికి ఇందిరా నగర్ పాఠశాల ఒక ఉదాహరణ అన్నారు. పాఠశాలలో 350 మందికి పైగా విద్యార్థులు చదువుతుండటం పాఠశాల పనితీరుకు నిదర్శనమన్నారు.