ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ప్రారంభం

ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు తెరలేచింది. ఈ మెగా ఈవెంట్ ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా ఘనంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య (ఐఏఎఫ్) అధ్యక్షుడు సెబాస్టియన్ కో, భారత అథ్లెటిక్స్ సంఘం చీఫ్ అడిల్లె సమరివాలా, కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తదితరులు హాజరైన కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పోటీలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. వచ్చేనెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు అర్హతే లక్ష్యంగా జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం 44 దేశాల నుంచి 800 మంది అథ్లెట్లు 42 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు.

ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ సంగీత దర్శక త్రయం శంకర్-ఎహ్‌సాన్-లాయ్ రూపొందించిన రంగబతి అనే సంబల్‌పురి జానపద గీతానికి కళాకారులు చేసిన నృత్యాలు కట్టిపడేశాయి. నాలుగురోజుల పాటు జరిగే ఈ అతిపెద్ద ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వడం భారత్‌కిది మూడోసారి. గతంలో 1989 (న్యూఢిల్లీ), 2013 (పుణె) టోర్నీలు భారత్‌లో జరిగాయి. ఆతిథ్య భారత్ నుంచి అత్యధికంగా 95మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, ఈసారి తమ దేశ స్టార్ అథ్లెట్లు లేకుండానే చైనా 50మందికిపైకి అథ్లెట్లతో పోటీపడుతున్నది. దాయాది పాకిస్థాన్ నుంచి 6గురు అథ్లెట్లు బరిలో ఉన్నారు. గత ఎడిషన్‌లో 13 పతకాలు (4 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలు) సాధించిన భారత్ ఈసారి సొంతగడ్డపై వీలైనని ఎక్కువ పతకాలు కొల్లగొట్టి టాప్-3లో నిలువాలన్న లక్ష్యంతో ఈవెంట్‌లో బరిలో దిగుతున్నది. ప్రధానంగా నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), మన్‌ప్రీత్ కౌర్ (మహిళల షాట్‌పుట్), పురుషులు, మహిళల 4*400 మీటర్ల రిలే జట్లపై స్వర్ణ పతక ఆశలున్నాయి. వీళ్లతోపాటు వికాస్ గౌడ (డిస్కస్ త్రో), అన్నూరాణి (జావెలిన్ త్ర, ద్యుతీ చాంద్ (100 మీటర్ల స్ప్రింట్)లపైనా పతక అంచనాలున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రధాన పోటీలు జరుగుతాయి.